గురువింద గింజ సామెతలా వైసీపీ తీరు!
posted on Apr 24, 2024 9:47AM
సుద్దులు చెప్పడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. గురివింద గింజ సామెత ఆ పార్టీ చెప్పే నీతి వాక్యాలు చూస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత.. ఓటమి వాకిలి మాత్రమే తెరిచి ఉన్న తరుణంలో వైసీపీకి ముస్లిం మైనారిటీలు గుర్తుకు వచ్చారు. ఇప్పుడు వారి ఓట్లు రాబట్టుకుని గట్టెక్కే ప్రయత్నాలకు తెరతీసింది. ప్రధాని నరేంద్రమోడీ రాజస్థాన్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రసంగాన్ని పట్టుకుని చంద్రబాబును ముస్లింలకు బూచిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నది.
నిజానికి వైసీపీ ఇప్పటి వరకూ అన్ని విషయాలలోనూ బీజేపీకి మద్దతుగా నిలబడింది. ఇప్పుడు మోడీనీ, ఆయనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును ముస్లిం వ్యతిరేకులుగా ముద్రవేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ వివాదాస్పద ట్రిపుల్ తలాక్, సీఏఏ విషయంలో కోరకుండానే బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని కన్వీనియెంట్ గా మరిచిపోతోంది. జనాలకు ఆ విషయం గుర్తుండదని నమ్ముతోంది.
అయితే ఇక్కడ కూడా ఆ పార్టీ అధినేత తన ఎన్నికల ప్రచారంలో మోడీని కానీ, బీజేపీని కానీ పన్నెత్తు మాట అనడం లేదు. అయితే చంద్రబాబుతో బంధుత్వం ఉందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.
అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ప్రసంగాన్ని వైరల్ చేస్తున్నది. ఆ ప్రసంగంలో ఆయన కాంగ్రెస్ ప్రజల ఆస్తులను ముస్లింలకు పంచాలని చూస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. మోడీ వ్యాఖ్యలను చంద్రబాబుకు ఆపాదిస్తూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లింలకు నష్టం చేకూరుతుందంటూ ఊదరగొడుతోంది. అయితే నెటిజనులు వైసీపీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నారు. సీఏఏ, ట్రిపుల్ తలాక్ ల విషయంలో వైసీపీ మోడీకి బేషరతు మద్దతు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ నెటిజనులు గురువింద గింజ సామెతను గుర్తు చేస్తున్నారు.