వైసీపీ అభ్యర్థి మహా మంచి పొరపాటు!

ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అంటూ వుంటారు. ఈ తరహాలోనే ఒక్కోసారి ‘పొరపాటు కూడా మంచిదే’ అనొచ్చు. అలాంటి మంచి పొరపాట్లు అరుదుగా జరుగుతాయి. లేటెస్టుగా అలాంటి మంచి పొరపాటు చేసే అవకాశం కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డికి వచ్చింది. ఎన్నికల సందర్భంగా హోరాహోరీగా ప్రచారం చేసిన ఆయన, పోలింగ్ రోజున తన ఓటు వేయడానికి వెళ్ళారు. ఓటు వేయడానికి వెళ్ళిన ఆయన చక్కగా ఓటేసి రావచ్చు కదా.. ఈయన అలా చేయకుండా పోలింగ్ బూత్‌ దగ్గర వున్న పోలింగ్ సిబ్బందికి బిల్డప్‌గా అభివాదం చేశారు. ఆ అభివాదాల గోలలో పడి,  ఈవీఎం మీద వున్న ఫ్యాన్ గుర్తు ముందువున్న బటన్ నొక్కకుండా, సైకిల్ గుర్తు ముందు వున్న బటన్ నొక్కేశారు. దాంతో ఈయన గారి ఓటు వైసీపీ ఎంపీ అభ్యర్థికి పడకుండా నెల్లూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి పడింది. బటన్ నొక్కిన తర్వాత విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన వెంటనే పోలింగ్ సిబ్బందికి ఏం జరిగిందో చెప్పారు. అప్పుడు పోలింగ్ సిబ్బంది ఇక చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి, తూర్పు తిరిగి దణ్ణం పెట్టి, ఇంటికి వెళ్ళి పెరుగన్నం తిని బబ్బోమని చెప్పారు. ఇలాంటి పొరపాటు చేశానేంట్రా దేవుడా అనుకుంటూ ప్రతాప్ రెడ్డి పోలింగ్ స్టేషన్ నుంచి బయటపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, ప్రతాప్ రెడ్డి పొరపాటు చేసినప్పటికీ, టీడీపీకి ఓటు వేయడం మంచి పనేగా?