మోడీకి ‘ఆశ కురుపులు’ వస్తాయేమో!

మనం చిన్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ‘ఆశ కురుపులు’ వస్తాయని అనుకునేవాళ్ళం. అంటే, ఎవరికైనా ఏదైనా ఇస్తామని చెబితే కచ్చితంగా ఇచ్చేయాలి. లేకపోతే కంటి మీద  ఒక స్పెషల్ కురుపులు వస్తాయి. వాటిని ‘ఆశ కురుపులు’ అంటారు.  ఇప్పుడు ఇలాంటి ‘ఆశ కురుపులు’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల బ్లాక్ మనీ బోలెడంత వుందని, దాన్ని ఇండియాకి పట్టుకొస్తానని, అలా తెచ్చి, ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని చెప్పారు. ఆ తర్వాత వెంటనే పేదలందరి పేరు మీద ‘జనధన్’ పేరుతో బ్యాంకు ఖాతాలు కూడా తెరిచారు. దాంతో పేదలందరూ మోడీకి ఓటేశారు. మోడీ తమ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తారని ఆశగా ఎదురుచూశారు. పాపం మన దేశంలో జనం అంతేకదా.. ఎవరు ఏది ఇస్తామన్నా వద్దనరు.. ఆశలు పెంచుకుంటారు. ఎవరు ఏమిస్తారా.. తీసుకుందామా అని వెయ్యి కళ్ళతో, చాచిన చేతులతో ఎదురు చూస్తారు. అలా పదిహేను లక్షల కోసం ఆశలు పెట్టుకున్న జనం నిరాశకు గురయ్యారు. మోడీ స్విట్జర్లాండ్ నుంచి డబ్బు తెచ్చిందీ లేదు.. పేదల బ్యాంక్ అకౌంట్లలో వేసిందీ లేదు. అలాగే 2019 ఎన్నికలప్పుడు రైతు ఆదాయం రెట్టింపు చేస్తాననే హామీ ద్వారా రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి, ఆ తర్వాత రైతులను భూమ్మీదే వుంచారు.

ఇప్పుడు మరోసారి ఎన్నికలు వచ్చాయి. మోడీ గారు మరోసారి పేద జనాలకు సరికొత్త ఆశ పెడుతున్నారు. అవినీతి కేసుల విచారణ సందర్భంగా ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తాన్నీ పేదలకు పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు మోడీ చెబుతున్నారు. ‘‘కొందరు వ్యక్తులు అధికార బలంతో, తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా పేదలకు చెందాలని కోరుకుంటున్నాను. ఈ డబ్బంతా పేదలకు పంచడం కోసం ఏంచేయాలనే విషయాన్ని పరిశీలించడానికి న్యాయబృందాన్ని ఇప్పటికే కోరాను. దీనికోసం చట్టాలను  మార్చడానికి కూడా వెనుకాడను’’ అని మోడీ అంటున్నారు. ఇలా పేదలకు ఆశల మీద ఆశలు పెడుతున్న మోడీ వాటిని ఈసారైనా నెరవేరుస్తారా? లేకపోతే ఆయనకు ‘ఆశ కురుపులు’ రావడం ఖాయం!