ఎన్నికలైపోయాయి.. సొమ్ములు కరిగిపోయాయి.. బటన్ నొక్కిన డబ్బుల జాడేదీ?!

ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు.

రాష్ట్రంలోని బ్యాంకులను గత శనివారం (మే 11) రెండో శనివారమైనా సరే తెరిచి ఉంచాలని హుకుం జారీ చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సొమ్ము పంపిణీకి ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నికల సంఘం కొర్రీ వేయడంతో సొమ్ముల పంపిణీ ఆగింది.   దీంతో లబ్ధిదారులమంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. బటన్ నొక్కి నెలలైనా సొమ్ములు పడకపోయినా ప్రశ్నించని ఈ లబ్ధిదారలు సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లడం వెనుక ఉన్నదెవరో ఊహకి అందని విషయం కాదు. నాటకీయ పరిణామాల మధ్య గతంలో నొక్కిన బటన్లకు సంబంధించిన సొమ్మును పోలింగ్ పూర్తి అయిన మరునాడు మే 14న లబ్ధాదారుల ఖాతాలలో జమచేయాలని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ములు జమచేయడానికి ఎక్కడ లేని తొందరా ప్రదర్శించిన సర్కార్, మరీ ముఖ్యంగా సీఎస్.. పోలింగ్ ముగిసిన తరువాత మాత్రం ఆ ఊసే మరచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు.  అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెరగడంతో  ఫీజు రీఎంబర్స్ మెంట్…  ఆసరా పథకం డబ్బులు  కొంత మేరకు మాత్రమే జమ చేశారు. కొంత మేర అంటే మొత్తం జమ చేయాల్సిన సొమ్ములలో ఓ పది శాతం విదిల్చినట్లుగా లబ్థిదారుల ఖాతాలలో జమ చేశారు.

లబ్ధిదారులకు పంచాల్సిన సొమ్ములు అడ్డదారుల్లో అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లింపులుగా మరళిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసి లబ్ధిపొందుదామని తహతహలాడిన జగన్ అది కుదరకపోయేసరికి లబ్ధిదారుల పట్ల ఆయన ‘నిజమైన ప్రేమ’ ప్రదర్శించారు. వారికి ఇవ్వాల్సిన సొమ్ములకు ఎగనామం పెట్టేసి అస్మదీయ కాంట్రాక్టర్లకు పందేరం చేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.