ప్రపంచాన్ని ఇముడ్చుకున్న టెలివిజన్.. ఆవిష్కారమైన రోజు…
posted on Nov 21, 2022 11:49AM
ఒక 20 సంవత్సరాల కిందటి కాలంలోకి చూస్తే అప్పటి ప్రపంచం వేరుగా ఉండేది. అక్కడక్కడా కనిపించే బుల్లితెర సందడి ఒక అద్బుతంగానే ఉండేది. బొమ్మలు కదులుతూ మాటలు, హవాభావాలు అందరికీ వీణులవిందు చేస్తుండేది. ఇదంతా టివి గా మనం పిలుచుకునే టెలివిజన్ కథ.
ప్రస్తుతకాలంలో టెలివిజన్ చాలా రూపాంతరం చెంది దీర్ఘచతురస్ర చెక్క పలక అంత పరిమాణంలోకి వచ్చింది. టీవీ లేని ఇల్లు అంటూ ఇప్పుడు ఎక్కడా లేదేమో...
1996లో, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి టెలివిజన్ గురించి నిర్ణయం తీసుకోవడంపై బలమైన కారణమే ఉంది. టెలివిజన్ గురించి ఐక్యరాజ్యసమితి నిర్ణయం వెలువరించిన కాలానికి టెలివిజన్ అనేది ఒక అద్భుతమైన ప్రసార సాధనం. ఇది మనిషి జీవితం పై ఎక్కువ ప్రభావం చూపుతుందని, అలాగే వినోద పరిశ్రమకు అంబాసిడర్‌గా కూడా ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని గుర్తించింది. టెలివిజన్ అనేది కమ్యూనికేషన్ మరియు గ్లోబలైజేషన్ యొక్క చిహ్నం అని ఐక్యరాజ్యసమితి తెలియజేసింది.
ఇంతటి ప్రధాన పాత్ర పోషించిన టెలివిజన్ చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలి.
1927లో, ఫిలో టేలర్ ఫార్న్స్‌వర్త్ అనే 21 ఏళ్ల వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ టెలివిజన్‌ను కనుగొన్నాడు. అతను 14 సంవత్సరాల వయస్సు వరకు కరెంటు ప్రసారం లేని ఇంటిలో నివసించాడు. అతను తన ఉన్నత పాఠశాలలో కదిలే చిత్రాలను సంగ్రహించి, వాటిని కోడ్‌గా మార్చగల వ్యవస్థ గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అంతేకాకుండా రేడియో తరంగాలతో ఆ చిత్రాలను వివిధ పరికరాలకు తరలించాడు. ఎలక్ట్రాన్ల పుంజం ఉపయోగించి కదిలే చిత్రాలను సంగ్రహించడంలో అతను మెకానికల్ టెలివిజన్ వ్యవస్థ కంటే చాలా సంవత్సరాలు ముందున్నాడు. అయితే ప్రపంచ సమాచార వ్యాప్తిని ప్రోత్సహించే అంతర్జాతీయ దినోత్సవానికి టెలివిజన్ చిహ్నంగా మారుతుందని అప్పుడు అతను ఊహమాత్రంగా అయినా అనుకుని ఉండడు.
1996లో నవంబర్ 21 మరియు 22 తేదీల్లో ఐక్యరాజ్యసమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరమ్‌ను నిర్వహించింది. ఇక్కడ, ప్రముఖ మీడియా వ్యక్తులు వేగంగా మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న టెలివిజన్ ప్రాముఖ్యతను చర్చించడానికి మరియు వారి పరస్పర సహకారాన్ని ఎలా పెంచుకోవచ్చో పరిశీలించడానికి సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి నాయకులు ప్రజలలో టెలివిజన్ ఓ సానుకూల దృష్టిని తీసుకురాగలదని, శాంతి మరియు భద్రతకు ముప్పుల గురించి అవగాహన పెంచుతుందని, సామాజిక మరియు ఆర్థిక సమస్యలపై దృష్టిని పదును పెట్టగలదని గుర్తించారు.
ఇక ప్రపంచ రాజకీయాలపై నిస్సందేహంగా ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడం, ప్రసారం చేయడం మరియు ప్రభావితం చేయడంలో టెలివిజన్ ఒక ప్రధాన సాధనంగా గుర్తించబడింది. ఈ సంఘటన కారణంగా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 21 ప్రపంచ టెలివిజన్ నిర్వహించుకోవాలని నిర్ణయించింది, టెలివిజన్ డే అనేది కేవలం ఆ వస్తువును గుర్తుచేసుకోవడం, దాన్ని చూడటంతో ముగిసిపోయేది కాదు. అది ప్రాతినిధ్యం వహిస్తున్న సమకాలీన ప్రపంచంలో కమ్యూనికేషన్ మరియు ప్రపంచీకరణకు చిహ్నం.
ఇది ఒకనాటి తరానికి అద్భుతంగా అనిపించిన టెలివిజన్ కథ.
◆ నిశ్శబ్ద.