మనకు మనమే మిత్రుడు, శత్రువు అంటారు ఇందుకే..

మనిషి జీవితంలో మానసిక దృక్పథం గొప్ప పాత్ర పోషిస్తుంది. సరైన మానసిక దృక్పథంతో, మనల్ని మనం చక్కగా అదుపులో పెట్టుకున్నప్పుడు, మన శ్రేయస్సును మనమే ప్రోదిచేసుకుంటాము. అలా కాక చెదిరిన మనస్సుతో, అజ్ఞానపు మబ్బులు క్రమ్మిన మనస్సు మనకే శత్రువుగా తయారవుతుంది. మనల్ని మనం కించపరుచుకున్న ప్రతిసారీ మనలోని ఉన్నతమైన ఆత్మకు మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నామన్న మాట. 

నిజానికి మనల్ని మనం కించపరచుకున్నప్పుడు మనలో ఉన్న ఆత్మశక్తిపై మనకు నమ్మకం లేదని అర్థం. మనల్ని మనం నాశనం చేసుకోవడానికి ఇదే కారణం. అదే విధంగా, మనం గర్వం, అహంకారంతో మిడిసిపడుతున్నప్పుడు కూడా మనం ఆ ఆత్మశక్తి నుంచి మరలిపోతున్నామన్నమాట. ఈ అహంకారం రెండు విధాలుగా పనిచెయ్యగలదు. దంభాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పుడే కాక విషాదంలో, నిస్పృహలో మునిగిపోయినప్పుడు కూడా ఈ అహంకారమే మనలో పనిచేస్తూ ఉంటుంది. దీనిని బట్టి, మనకు అన్నిటికన్నా మించి ఒక సమస్థితి కలిగిన మనస్సు కావాలి అని అర్థమవుతుంది. ఆ సమస్థితితో మనస్సు ఒక అంచు నుంచి మరొక అంచుకు పరుగులు తీయకుండా ఉండాలి.

మనం ధనవంతులమనీ, అధికారం కలవారమనీ మిడిసిపడటం ఒకవైపు అయితే, మనకేమీ లేదనీ, పేదవారమనీ, దుఃఖాలలో మునిగి ఉన్నామనీ అనుకోవడం రెండవవైపు. ఈ రెంటికీ మధ్యనున్న మార్గాన్ని మనం అనుసరించాలి. వేదాలలో కనిపించే బోధలు, మనకు ఆ మార్గాన్ని అత్యంత శక్తిమంతంగా, స్పష్టంగా చూపాయి. మిగిలిన విషయాలన్నింటికన్నా మిన్నగా మనకు ఈ సమస్థితి కావాలనీ, ఇది కేవలం ఆధ్యాత్మిక జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుకునేవారి కోసం మాత్రమే కాక మన రోజువారీ జీవితంలో కూడా అంతే అవసరం. 

కొందరు చిన్నచిన్న విషయాలను కూడా తట్టుకోలేరు. వాతావరణం కొద్దిగా వేడెక్కినా, కొద్దిగా చలిగాలి వీచినా వారు గోరంతలు కొండంతలు చేసి తమ బాధల్ని వివరిస్తారు. కానీ అదంతా వారి మనస్సులో తయారయినదే. నిజానికి మనం అత్యంత విషాదం అని భావించే పరిస్థితి కూడా మన మనస్సులో తయారు చేసుకున్నదే.

మన విషయమేమిటో మనమే ముందుగా గమనించాలి. ఒకరోజు మనం మంచి ఉత్సాహం నిండిన మనస్సుతో, ధైర్యంతో, నిర్భయంగా, అంతా భగవదర్పణమే అన్నట్టు పనిచేస్తాము. మరొకరోజు నిరాశతో, సంశయంతో, అసంతృప్తితో పనిచేస్తాము. వీటియొక్క ప్రభావం మన జీవితం మీద ఎలావుంటుందో మనం గమనిస్తే, 'మనకు మనమే మిత్రుడు, మనకు మనమే శత్రువు' అని ఎందుకు చెప్పారో ఇట్టే అర్ధమవుతుంది. నిస్పృహ వల్ల మనల్ని మనమే అధోగతి పాలుచేసుకోవడం కాక తోటివారిని కూడా మనతో పాటు క్రిందికి లాగుతాము. 

ఎవరైతే అలాంటి నిరాశానిస్పృహలలో మునిగిపోయి ఉంటారో, వారికి వేరొకరి జీవితాన్ని తాకే అధికారం లేదు అని ఒక గొప్ప గురువు చెప్పుతూ ఉండేవాడు. జీవితమనేది విషాదంగా ఉండటం కోసం కాదు. మన నెత్తిమీద ఉన్న బరువును వేరొకరిని మోయమనడం సమంజసం కాదు. విచ్చలవిడి ప్రవర్తన వల్ల ప్రయోజనం లేదు. 

కొందరు విషాదంలో మునిగితేలుతూ ఉంటారు. చూడబోతే వారికి అదే చాలా ఇష్టంగా కనిపిస్తున్నట్టు తోస్తుంది. మీరు వారిని అందులోనుండి ఒకసారి బయటకు లాగితే వాళ్ళు తిరిగి అందులోనే పడిపోతూ ఉంటారు. వారికి ఆ నిస్పృహ అనే పంజరంలో ఉండటం అలవాటయిపోయింది. ఇక వారు తమకు తామే అందులోనుంచి బయట పడాలి. ప్రపంచంలోని మతాలన్నీ కలసి, అత్యున్నతమైన ఆదర్శాలన్నీ వారికి బోధించినా, వారిని వారు మేల్కొల్పుకునేవరకూ, వాటివల్ల వారికి ఏ ప్రయోజనమూ ఉండదు. అందుచేతనే భగవద్గీత ఎలుగెత్తి ఘోషించింది - "నిన్ను నీవు, నీచేతనే ఉద్దరించుకోవాలి! నిన్ను నీవు దిగజార్చుకోకూడదు!" అని.

                                        ◆నిశ్శబ్ద.

Related Segment News