సాధకులే విజెలవుతారు.. విజయం ఎలా చేకూరుతుంది?

ఈ ప్రపంచంలో ఎంతో మంది కలలు కనే పదం విజయం. ఈ పదాన్ని పలకడం ఎంత సులభమో.. ఆ విజయాన్ని సాధించడం అంత కష్టం. కేవలం కష్టం మాత్రమే కాదు.. వ్యక్తిలో కృషి, పట్టుదల, తెలివితేటలు, ఆత్మస్తైర్యం, పోటీపడే తత్వం, విషయం పట్ల అవగాహన ఇవన్నీ ఉండాలి విజయం సాధించాలంటే.. అందుకే విజయానికి కొందరు మాత్రమే అర్హులు అవుతున్నారు. 

ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన world achievers day ని జరుపుకుంటారు. ఆయా రంగాలలో కృషి చేసి విజయాలు సాధించినందుకు వారిని గుర్తుచేసుకోవడం ఈ అచీవర్స్ డే ని జరుపుకుంటారు. 

 జనాదరణ పొందినవారినో.. కేవలం ప్రముఖులు, ప్రభావవంతమైన వారినో  గౌరవించే రోజు కాదు ఇది.  ప్రతి వర్గంలో.. ప్రతి వ్యక్తిని గుర్తించే దినం. వ్యక్తి స్తాయితో సంబంధం లేకుండా.. ప్రతిభ కలిగిన అందరినీ గుర్తించాలని చెప్పడమే ఈ రోజు ఉద్దేశం. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, పౌర సేవకులు ఇలా ప్రతి ఒక్కరూ వారి స్థాయికి కాకుండా వారి కృషికి అనుగుణంగా గౌరవించబడతారు, గుర్తుచేసుకోబడతారు.  వారి తెలివితేటలు, ధైర్యం, నిస్వార్థత, సృజనాత్మకత ద్వారా  ప్రపంచాన్ని మరింత మెరుగ్గా  మార్చడానికి కృషి చేశారు. అలాగే దేశాల ప్రగతిని ఇనుమడింపజేస్తూ  తెలివితేటలతో ఎదుగుతున్న  అత్యుత్తమ విద్యార్థులు కూడా ఈ సందర్భంగా గౌరవానికి అర్హులే..

ఈ రోజున ఎవరైనా సరే..  వారి వయస్సు, లింగం, సామాజిక స్థితి, విద్యా స్థాయి లేదా జాతితో సంబంధం లేకుండా..  జీవితంలోని ఏ రంగంలోనైనా ఏదైనా వినూత్నమైన లేదా ప్రత్యేకమైన ఘనత సాధించిన వారికి పతకం, సర్టిఫికేట్, బహుమతి లేదా ఏదైనా ఇతర అవార్డును అందజేయడం జరుగుతుంది. తద్వారా వారు మరింత కృషి చేసేదిశగా గొప్ప ప్రోత్సాహం అందించినట్టు అవుతుంది. 

ఈ అచీవర్స్ డే సందర్భంగా.. పిల్లలకు వివిధ రంగాలలో కృషి చేసిన గొప్పవారి గురించి పరిచయం చేయడం, పిల్లల్లో ప్రతిభ పెంచుకోవాలనే తపనను క్రమంగా పెంచడం. లక్ష్య సాధనకై పిల్లలను నడిపించడం చేయవచ్చు. 

విజయం ఎలా చేకూరుతుంది?? ఈ ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలు చేసి, గొప్పగా ఎదిగిన వ్యక్తులు విజయాన్ని అక్కున చేర్చుకోవడానికి వెనుక ఎంత కృషి చేసారు?? వారి కష్టాలు, సమస్యలు, సవాళ్లు, త్యాగాలు ఇలా ఎన్నో విషయాలను పిల్లలకు వివరించడం ద్వారా పిల్లలో విజేతలు లక్షణాలు పెంపొందించవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు.. నేటి ప్రతిభావంతులు రేపటి విజేతలు అవుతారు. కాబట్టి పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని వ్యక్తుల చేతుల్లోనే ఉంది. 

                             ◆నిశ్శబ్ద.

Related Segment News