జగన్ కోసం చిరంజీవి-పవన్ ఏకంకానున్నారా? జనసేనాని నయా వ్యూహమేంటి?

 

ప్రజారాజ్యం అధికారంలోకి రాకపోయి ఉండొచ్చు... చిరంజీవి సొంత నియోజకవర్గంలో ఓడిపోయి ఉండొచ్చు... కానీ, మూడు బలమైన పార్టీలు(కాంగ్రెస్-టీడీపీ-టీఆర్ఎస్), ముగ్గురు బలమైన నేతలు (వైఎస్-చంద్రబాబు-కేసీఆర్) తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి... కేవలం 18 సీట్లకే పరిమితమైనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 80లక్షల ఓట్లు కొల్లగొట్టారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో విజయం దగ్గరిదాకా వచ్చి అతిస్వల్ప తేడాతో చేజార్చుకున్నారు. ఇదంతా ఇఫ్పుడెందుకంటే, చిరంజీవిపై ప్రజలకున్న అపారమైన అభిమానాన్ని ఎవరూ కాదనలేరు. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. కానీ, రైట్ టైమ్ లో రాజకీయాల్లో రాకపోవడం, ఆ తర్వాత నిలబడి పోరాటం చేయకపోవడం చిరంజీవికి పెద్ద మైనస్ గా మారింది. ఇక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం అతిపెద్ద తప్పిదంగా మిగిలిపోయింది. ఒకవేళ ఇప్పటికీ పీఆర్పీ ఉండుంటే, రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ఉండేదని అంటారు. 

అయితే, ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటోన్న చిరంజీవిపై ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఒకసారి బీజేపీలో చేరతారని, మరోసారి తమ్ముడు పవన్ కు అండగా జనసేనకు మద్దతిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మరోసారి అలాంటి ఊహాగానాలే మరోసారి వినిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవి-పవన్ కల్యాణ్ పదేపదే కలుస్తుండటంతో కొత్త వార్త బయటికొచ్చింది. రాజకీయంగా మళ్లీ ఇద్దరూ ఏకమవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాల పరంగా, కులంపరంగా మెగా కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని బలమున్నప్పటికీ, మొన్నటి ఎన్నికల్లో జనసేన అంతగా ప్రభావం చూపించలేకపోవడం, కనీసం పీఆర్పీకి దరిదాపుల్లో కూడా ఓటు షేర్ సాధించలేకపోవడం, పైగా పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో... జనసేనాని ఆలోచనలో పడ్డారని అంటున్నారు. పీఆర్పీ విలీనం నేపథ్యంతో... ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పేరు ఎత్తడానికి కూడా పవన్ కల్యాణ్ పెద్దగా ఇష్టపడేవారుకాదు. ఎందుకంటే, చిరు ప్రస్తావన వస్తే, జనసేనకు ఏమాత్రం మంచిదికాదని భావించేవారు. అయితే, ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పవన్ ఆలోచనలో మార్పు వచ్చిందంటున్నారు. చిరంజీవి అండ తనకు కావాలని భావిస్తున్నారట. అందుకే ఇటీవల చిరంజీవికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి తప్పక హాజరవుతున్నారని అంటున్నారు. ఆ నేపథ్యంలోనే చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు అటెండ్ అవ్వడం, సైరా టీజర్ కి వాయిస్ ఇవ్వడం, ఇఫ్పుడు సినిమాకి డబ్బింగ్ చెప్పడం, సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవడం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

అయితే, మొన్నటి ఎన్నికల్లో జనసేనకు మరీ అంత దారుణమైన ఫలితాలు రావడానికి, చిరంజీవికి పవన్ దూరం మెయింటైన్ చేయడమూ ఒక కారణమనే వాదనలు ఉన్నాయి. చిరంజీవి అభిమానులు, సొంత వర్గం ప్రజలు కూడా జనసేనకు ఓట్లేయలేదన్న విశ్లేషణలు జరిగాయి. అందుకే, చిరంజీవితో సహా మెగా కుటుంబం మొత్తానికి కలుపుకుని పోవాలని పవన్ నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగా అన్నయ్య చిరంజీవిని జనసేనలోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఒకవేళ అన్నయ్య చిరంజీవి అండ దొరికితే, వచ్చే ఎన్నికల నాటికి, వైసీపీకి జనసేనే ప్రధాన ప్రత్యర్ధి అవుతుందని పవన్ భావిస్తున్నారు. ఏదిఏమైనా తన బలానికి మెగా బలం కూడా తోడైతేనే అనుకున్న గమ్యాన్ని చేరడం సాధ్యమవుతుందని, అందుకు అన్నయ్య చిరంజీవి సహకారం కావాలని పవన్ తపిస్తున్నారట. అయితే, తిరిగి రాజకీయాల్లోకి రావడానికి చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. మరి, ఆనాడు పీఆర్పీ సమయంలో అన్నయ్యకు తమ్ముడు తోడుగా ఉన్నట్లు, ఇఫ్పుడు జనసేనకు అన్నయ్య అండగా నిలుస్తారా లేదో కాలమే సమాధానం చెప్పాలి.