జగనన్నను ప్రశ్నించవా షర్మిలక్క! అంతా డ్రామానేనా.. ! 

తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగితే ఎవ‌రినైనా ఎదిరిస్తా. ఒక్క నీటిబొట్టు తేడా వ‌చ్చినా ఏపీతోనైనా పోరాడ‌తా. లోట‌స్‌పాండ్‌లో రాజ‌కీయ స‌న్నాహ‌క సమావేశంలో వైఎస్ ష‌ర్మిల చేసిన స్టేట్‌మెంట్స్ ఇవి. ఫ‌స్ట్ స్పీచ్ అంటే ఎంత ప‌ర్‌ఫెక్ట్‌గా వ‌ర్క‌వుట్ చేసి ఉంటారు. ఒక్కో పాయింట్ రాసుకుని, లెక్క‌లు వేసుకొని, ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చి.. ప్ర‌సంగిస్తారు. కాబ‌ట్టి, ష‌ర్మిల నోటి నుంచి వ‌చ్చిన తొలి మాట‌ల‌కు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. మ‌రి, ఇప్పుడు ఏమైంది? నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాలు నీళ్ల కోసం లొల్లి లొల్లి చేస్తుంటే.. ష‌ర్మిల‌క్క ఎందుకు మౌనంగా ఉంటున్నారు. పార్టీ పెడ‌తాన‌ని అన్న‌ప్ప‌టి నుంచీ చీమ చిటుక్కుమ‌న్నా స్పందిస్తున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ మ‌ధ్య ఏకంగా జ‌ల ఫిరంగులే పేలుతుంటే.. ఆమె నోటి నుంచి ఒక్క ప‌ద‌మైనా బ‌య‌ట‌కు రావ‌డం లేదేంటి? నిరుద్యోగ స‌మ‌స్య‌, రైతుల స‌మ‌స్య‌ల‌పై ట్వీట్ల‌తో నిత్యం ట‌చ్‌లో ఉండే ష‌ర్మిల‌.. నాలుగు రోజులుగా నీటి ప్రాజెక్టుల స‌మ‌స్య‌పై ఒక్క ట్వీట్ కూడా చేయ‌లేదేం? ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్‌గా ఇంట్రెస్టింగ్ పాయింట్.

వైఎస్ ష‌ర్మిల‌. వైఎస్సార్ త‌న‌య‌గా వైఎస్ జ‌గ‌న్ సోద‌రిగా అంద‌రికీ సుప‌రిచిత‌మే. తాను తెలంగాణ కోడ‌లినంటూ స‌డెన్‌గా ఊడిపడ్డారు. ఎవ‌రూ అడ‌క్క‌ముందే రాజ‌న్న‌రాజ్యం తీసుకొస్తానంటూ ముందుకొచ్చారు. మొద‌ట్లో జ‌నాలు ఆమెను చూసి న‌వ్వుకున్నారు. ఆమె జ‌గ‌న‌న్న బాణమ‌ని కొంద‌రు, కేసీఆర్ కోవ‌ర్ట్ అని మ‌రికొంద‌రు, బీజేపీ పొలిటిక‌ల్ గేమ్ అని ఇంకొంద‌రు.. ఎవ‌రికి తోచిన విధంగా వారు విశ్లేషించారు. ష‌ర్మిల మాత్రం ఇవేమీ ప‌ట్టించుకోకుండా.. ప‌ట్టుద‌ల‌గా ముందుకు వెళ్లారు. ఓ మీడియా ఆమెకు ఫుల్‌గా క‌వ‌రేజ్ ఇచ్చింది. ఖ‌మ్మం స‌భ‌తో త‌న రాజ‌కీయ ఉనికిని ఘ‌నంగా చాటారు ష‌ర్మిల‌. ఆ త‌ర్వాత నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఇందిరాపార్కు దీక్ష‌, పోలీసుల‌తో కొట్లాట‌, జాకెట్ చిన‌గ‌డంతో పొలిటిక‌ల్‌గా ఫుల్ మైలేజ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత కూడా ఆ టెంపో కంటిన్యూ చేద్దామ‌నుకున్నా.. క‌రోనా విజృంభించ‌డం, లాక్‌డౌన్ కార‌ణంతో ట్విట్ట‌ర్‌లో యాక్టివ్ అయ్యారు. ప్ర‌తీ ప్రజా స‌మ‌స్య‌పై స్పందిస్తూ.. సీఎం కేసీఆర్‌ను ట్వీట్ల‌తో గిల్లుతూ.. గిచ్చుతూ.. తాను కూడా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థినేన‌నే అనిపించేలా చేస్తున్నారు. ష‌ర్మిల ఇంత హ‌డావుడి చేస్తున్నా.. టీఆర్ఎస్ నుంచి ఒక చిన్న కౌంట‌ర్ కూడా ప‌డ‌టం లేదు. అస‌లామెను కారు పార్టీ గుర్తించ‌డ‌మే లేదు. దీంతో.. మ‌రింత ఫ్ర‌స్టేష‌న్‌లో మ‌రింతగా మాట‌ల‌కు ప‌దును పెడుతూ విమ‌ర్శ‌ల డోసు పెంచేశారు ష‌ర్మిల‌. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. ఇప్పుడిక అస‌లైన‌, అతిపెద్ద‌ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ష‌ర్మిల‌కు శ‌ల్య పరీక్ష‌కు గురి చేస్తోంది. అదే రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం. ఇంత‌టి కీల‌క ప‌రిణామంపై ష‌ర్మిల మాట్లాడ‌క‌పోవ‌డం ఆమె చిత్త‌శుద్ధిని శంకిచేలా ఉంది.

కృష్ణా న‌దిపై ప్రాజెక్టుల నిర్మాణంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల మ‌ధ్య వాట‌ర్ వార్ ఓ రేంజ్‌లో జ‌రుగుతోంది. తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో స్వ‌యంగా సీఎం కేసీఆరే ఏపీ తీరును తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామ‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు ఏపీ నీళ్ల మంత్రి అనిల్‌కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. మా నీళ్లు మేం వాడుకుంటే.. మా ప్రాజెక్టులు మేం క‌ట్టుకుంటే త‌ప్పేంట‌ని గ‌ట్టిగానే ప్రశ్నించారు. మంత్రి అనిల్ కామెంట్స్‌పై తెలంగాణ నుంచి మ‌ళ్లీ రివ‌ర్స్ అటాక్ జ‌రిగింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్ర‌శాంత్‌రెడ్డిలో చాలా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా సీఎం జ‌గ‌న్‌నే టార్గెట్ చేస్తూ.. వైఎస్సార్ నీళ్ల దొంగ‌.. వైఎస్ జ‌గ‌న్ గ‌జ‌దొంగ‌.. అంటూ కాక రేపారు. 

రెండు రాష్ట్రాల మ‌ధ్య ఈ రేంజ్‌లో వాట‌ర్ వార్ న‌డుస్తుంటే.. వైఎస్ ష‌ర్మిల మాత్రం త‌న‌కేం సంబంధం లేద‌న్న‌ట్టు మౌనంగా ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయ స‌న్నాహ‌క స‌భ‌లోనే.. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగితే ఎవ‌రినైనా ఎదిరిస్తా. ఒక్క నీటిబొట్టు తేడా వ‌చ్చినా ఏపీతోనైనా పోరాడ‌తా.. అంటూ ఆర్భాటంగా ప్ర‌సంగించి.. ఇప్పుడిక మాట్లాడాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ముఖం చాటేయ‌డ‌మేంట‌ని తెలంగాణ స‌మాజం నిల‌దీస్తోంది. తెలంగాణ కోసం ఎవ‌రినైనా ఎదిరిస్తా అన్నారుగా.. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వాన్ని ఎదిరించ‌రా? అని అడుగుతున్నారు. ఏపీ సీఎం త‌న అన్న జ‌గ‌న‌న్న కాబ‌ట్టి నోరు మూసుకున్నారా? కేవ‌లం కేసీఆర్‌ను తిట్ట‌డానికే పార్టీ పెడుతున్నారా? తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ కోసం కాదా? మ‌రి, ఏపీ ప్రాజెక్టుల‌తో తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అంతా మొత్తుకుంటుంటే.. ష‌ర్మిల మాత్రం ఎందుకు నోరు తెర‌వ‌డం లేదు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ జనాల నుంచి వస్తున్నాయి. 

తెలంగాణ కోసం ఎవ‌రినైనా ఎదిరిస్తా అంటే.. అందులో ఏపీ మిన‌హా.. సీఎం జ‌గ‌న్ మిన‌హా.. అని స‌వరించుకోవాలా? తెలంగాణ ఏర్ప‌డిందే నీళ్లు, నిధులు, నియామ‌కాల కోసం. ఈ ముడిట్లో మొద‌టి ప్రాధాన్యం నీళ్లే. ఆ నీళ్ల‌కు మొద‌టి నుంచీ ఏపీతోనే ప్రాబ్ల‌మ్. కృష్ణా జలాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించుకుపోతున్నార‌నేది ఏపీపై ప్ర‌ధాన ఆరోప‌ణ‌. మ‌రి, తెలంగాణ‌కు అతి పెద్ద స‌మ‌స్య‌గా మారిన జ‌ల వివాదంపై ష‌ర్మిల మౌనంగా ఉండ‌టం ఏమాత్రం మంచిది కాద‌ని అంటున్నారు. జగనన్న డైరెక్షన్ లోనే తెలంగాణలో షర్మిల పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో వైసీపీలో కీలకంగా ఉన్న నేతలే ఆమె వెంట తిరుగుతున్నారు. దీంతో షర్మిల పార్టీ వెనుక జగన్ ఉన్నారనే అనుమానాలు బలపడ్డాయి. తాజాగా జల వివాదానికి సంబంధించి షర్మిల సైలెంటుగా ఉండటంతో... జగనన్న డైరెక్షన్ లోనే ఆమె నడుస్తున్నారనే వాదన మరింత బలపడుతోంది. మ‌రి, కాస్త ఆల‌స్యంగానైనా ష‌ర్మిలా నోరు తెరుస్తారా?  జ‌గ‌న‌న్న తీరును ఏకి పారేస్తారా? చూడాలి.. రాజకీయంగా ష‌ర్మిల‌కు ఇది అగ్నిప‌రీక్షే.