ఒక్క‌రు చ‌నిపోయినా రూ.కోటి ఇవ్వాలి.. ఏపీకి సుప్రీం స్ట్రాంగ్ వార్నింగ్‌..

పరీక్షల కార‌ణంగా ఒక్క‌రు చ‌నిపోయినా.. ఒక్కొక్క‌రికీ కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించింది. క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఒక్కో గ‌దిలో 15 నుంచి 20 మంది విద్యార్థులను ప‌రీక్ష‌ల‌కు కూర్చోబెట్ట‌డం స‌మంజ‌స‌మా?  ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే 28వేల గ‌దులు అవ‌స‌రం అవుతాయి? అది సాధ్య‌మా? రెండో ద‌శ తీవ్రత చూశాక కూడా.. ఇంకా ప‌లు వేరియంట్లు పుట్టుకొస్తున్నాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నా కూడా.. ప్ర‌భుత్వం ఎందుకు ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంది.. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో మూడో వేవ్ వ‌స్తే ఏం చేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఏపీ స‌ర్కారును తీవ్ర స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది.  

రాష్ట్రాల బోర్డుల పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుమారు గంటన్నర పాటు వాదనలు జ‌రిగాయి. పరీక్షల తేదీలు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సేఫ్టీ అంశంపై ప్రణాళికలు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గ‌తంలోనే హెచ్చ‌రించింది సుప్రీంకోర్టు. తాజాగా మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్‌పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఇప్పటికే 10, 12 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం, 11 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. 12 వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రత్యామ్నాయం లేదని సుప్రీంకోర్టులో బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. శుక్రవారం మ‌రోసారి విచార‌ణ జ‌రిపి.. పరీక్షలు నిర్వహించాలా..? లేక, రద్దు చేయాలా..? అనే దానిపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.