నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగుబాటు?
posted on May 23, 2024 3:41PM
పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి ఈవీఎం ను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పిన్నెల్ల ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోనికి వచ్చిన తరువాత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనను తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.
దీంతో పోలీసులు పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బుధవారం (మే 22) ఆయన సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో చిక్కినట్లే చిక్కి తప్పించుకు పారిపోయారు. ఆ సందర్భంగా ఆయన కారును అందులో ఉన్న ఆయన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన కారు డ్రైవర్ ను కూడా అదుపులోనికి తీసుకున్నారు.
ఇలా ఉండగా ఆయన తమిళనాడు వెళ్లారనీ, అక్కడ నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్నరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇలా ఉండగా గురువారం (మే 23) ఆయన నరసరావు పేట కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నాయని అందిన సమాచారం మేరకు పోలీసులు నరసరావుపేట కోర్టు వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.