సోనియా పెళ్ళికి ముందు జీవితంమీద చర్చ అవసరమా!

ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ పుట్టుకను జాతీయ సమస్యగా దేశం ముందుకు తెచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని చేతకానితనం నుండి ఇలాంటి సమస్యలు సృష్టించి, ప్రజల దృష్టిని మళ్ళించి పబ్బంగడిపేసుకుంటారు. ఆ ట్రాప్ లో పడితే వాళ్ళు విజయం సాధించినట్టే. అసలు సమస్య వదిలేసి కొసరు సమస్య జాతీయ సమస్య అవుతుంది.

సోనియా ఎక్కడ పుట్టినా, ఆమెది ఏ మతం అయినా, ఏ పేరు అయినా, ఆమె ఈ దేశపు కోడలు. ఈ దేశ పౌరురాలు. ఇక్కడి ఆచారాల ప్రకారం పెళ్ళి తర్వాత అత్తవారింటికి రావడం, అవసరమైతే ఇంటిపేరుతో సహా మార్చుకోవడం మన సృప్రదాయం. అలా వచ్చిన కోడలిని ప్రశ్నించడం అంటే ఈదేశ ఆచారాల పట్ల, వివాహ వ్యవస్థ పట్ల వీళ్ళకు ఏమాత్రం గౌరవం ఉందో ఆలోచించాలి.

కాసేపు సోనియా వ్యవహారం పక్కన పెట్టి మన ఇళ్ళల్లో పెళ్ళి తర్వాత అత్తవారింటికి వచ్చిన వారిని, మన ఇంట్లో నుండి పెళ్ళి తర్వాత అత్తవారింటికి వెళ్ళిన వారిని అడిగి చూడండి... ఇలాంటి ప్రస్థావనలు, ఆ ప్రస్థావనతో వివక్ష అంగీకరిస్తారేమో !

విధానపరంగా ప్రత్యర్ధిని ఎదుర్కోలేక, పాలనా పరంగా ప్రజల అవసరాలు తీర్చి వారిని సంతృప్తి పరచలేక మాత్రమే ఇలాంటి వివాదాలు సృష్టించి ప్రజల దృష్టిని మరలిస్తారు.సోనియా పెళ్ళికిముందు జీవితాన్ని తెరపైకి తెచ్చి వివాదం చేయడాన్ని-- పెళ్ళిపేరుతో మన ఇంటికి వచ్చిన అమ్మను, భార్యను, పెళ్ళిపేరుతో వేరే ఇంటికి వెళ్ళిన తోబుట్టువును అడగండి సమర్ధిస్తారేమో...