యువతలో స్ట్రోక్ ప్రమాదానికి ఈ మూడే ముఖ్య కారణం!
posted on Jul 27, 2023 9:30AM
కొన్ని సంవత్సరాల క్రితం వరకు పక్షవాతం, మెదడు సంబంధిత వ్యాధులను వృద్ధాప్య సమస్యలుగా చెప్పేవారు. ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా మరచిపోయినా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నా అప్పుడే ముసలాడివైపోయావా ఏంటి? అని అంటుంటారు. ఇది కాస్త వెటకారంగా అనిపిస్తుంది కానీ ఇందులో నిజం అదే.. ఇవన్నీ వృద్దాప్యంలో శరీర సామర్థ్యం తగ్గడం వల్ల ఏర్పడేవి. కానీ ఇప్పుడు యువత కూడా వీటి బారిన పడుతున్నారు. ప్రస్తుతం యువతలో పెద్ద సంఖ్యలో ఈ ప్రమాదం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడులో రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏర్పడే ఈ సమస్య కొన్ని సందర్భాల్లో పక్షవాతం, మరణానికి కూడా దారి తీస్తుంది. ఏ వయసు వారైనా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నరాల సమస్యలు కూడా అనేక రకాల సమస్యలను పెంచుతున్నాయి. యువకులలో స్ట్రోక్ రావడానికి, వృద్ధులలో స్ట్రోక్ రావడానికి కారణాలు ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే వృద్దులలో వయసు పైబడటం వల్ల ఈ సమస్య వస్తే, యువతలో ఇతర కారణాల వల్ల వస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే కొన్ని అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తు యువతలో ఈ ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ఈ కింది సమస్యలు స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి.
అధిక రక్తపోటు సమస్య..
యువతలో అధిక రక్తపోటు సమస్య చాలా సాధారణమైనదిగా కనిపిస్తుంది. చాలా మంది ఉడుకు రక్తం, అందుకే ఆవేశపడతారు అని సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న స్థితిలో, ధమనుల గోడలపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో చీలిక ఏర్పడటం లేదా రక్త సరఫరాకు అడ్డుపడటానికి దారితీస్తుంది. ఇస్కీమిక్ స్ట్రోక్ వంటి అథెరోస్క్లెరోసిస్‌కు హైపర్‌టెన్షన్ ప్రధాన కారణమని తేలింది. ఇప్పట్లో అధిక రక్తపోటు 20-40 సంవత్సరాల వయస్సు గల ఎనిమిది మందిలో ఒకరిని ప్రభావితం చేస్తోంది.
మధుమేహం..
నేటికాలం యువతలో మధుమేహం సమస్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది. అది కూడా స్ట్రోక్ రిస్క్‌తో ముడిపడి ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువ. మధుమేహం సమస్య నరాలను ప్రభావితం చేస్తుంది, దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
ధూమపానం...
యువతకు ధూమపానం ఒక ఫ్యాషన్ గా తయారయింది. సిగరెట్ తాగేవారు హీరోలన్నట్టు, అసలైన మగాళ్లు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఈ ధూమపానం స్ట్రోక్ ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది. 2018 అధ్యయనం ప్రకారం 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల మగవారిని సుమారు మూడు సంవత్సరాల పాటు పరిశీలించింది. ఇందులో ప్రతిరోజూ సిగరెట్ తాగే వ్యక్తులకు ఇతర వ్యక్తుల కంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని పరిశోధకులు కనుగొన్నారు.
ధూమపానం స్ట్రోక్‌కు దారితీసే అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తనాళాల్లో ఉండే కణాలకు నష్టం చేకూరుస్తుంది. రక్త నాళాలు చిక్కగా లేదా ఇరుకైనవిగా మారుస్తుంది.
కాబట్టి ఈ మూడు విషయాల్లో యవత జాగ్రత్తగా ఉంటే స్ట్రోక్ ప్రమాదం నుండి గట్టెక్కవచ్చు.
*నిశ్శబ్ద.