ఆర్థిక క్రమశిక్షణ ఎదీ?

ఎవరి బడ్జెట్ వారిదే.. ఎవరి తీరు వారిదే.. ఎక్కడా సామరస్యం కనిపించడం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక దేశం అన్నట్లుగా ఆయారాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆర్థిక వ్యవహారాలవిషయంలో ఎవరి తీరు వారిదే అన్నట్లుగా తయారైంది. ప్రపంచాన్ని ఇప్పుడు ఆర్థిక మాంద్యం కమ్మేస్తోంది. ఇప్పటి వరకూ భారత్ మాత్రం ఆ ఆర్థిక మాంద్యం బారిన పడలేదు.

ఇందుకు కారణాలనేకం ఉన్నా.. దేశం కూడా ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే ఆర్థిక మాంద్యం బారిన పడక తప్పదన్నసంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కేంద్రం, కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఆ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇసుమంతైనా దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.  

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం, దేశ ఆర్థిక పరిస్థితి గురించిన పట్టింపే లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఏవో కొన్ని రాష్ట్రాలు ప్రపంచ ఆర్థిక పోకడలు.. రానున్న ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ విధానాలను సవరించుకుంటున్నప్పటికీ.. చాలా రాష్ట్రాలు తమ ఆర్థిక విధానాలను వచ్చే ఎన్నికలలో విజయానికి పెట్టుబడి మార్గాలుగానే భావిస్తు్నాయి.

ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయమే తీసుకుంటే సంక్షేమం పేరుతో ఉచితాలు, బుజ్జగింపులకే నిధులను దారాదత్తం చేస్తున్నది. ఉచితాల కోసం అప్పులు, ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులూ అంటూ, అభివృద్ధి, ఆదాయం పెంచుకునే మార్గాల వైపు దృష్టి సారించకుండా వ్యవహరిస్తున్నది.    సంక్షేమ పథకాలు, ఉచితా లపై చూపిస్తున్నంత శ్రద్ధను రాష్ట్రాలు పెట్టుబడులు, అభివృద్ధి, ఆదాయాన్నిపెంచుకునే విధానాలపై పై చూపించడం లేదు.  వర్తమాన ఆర్థిక సమస్యలను భవిష్యత్తుకు వాయిదా వేయాలన్న రాష్ట్రాల ఆలోచనల వల్ల భవిష్యత్  కూడా అంధకారమవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భవిష్యత్తు ప్రణాళికలపై, అవసరాలపై   దృష్టి పెట్టాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని, పెట్టుబడులు పెంచడానికి, ఆర్థిక వనరులను సమ కూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తమ దుబారా, వ్యర్ధ వ్యయాలను అదుపు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలను చుట్టుముట్టి, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న ఆర్థిక మాంద్యం భారతన్ను కూడా కబళించే అవకాశం లేకపోలేదు. భవిష్య త్తులో ఎదురు కాబోయే ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ తీరు మార్చుకుని, అభివృద్ధి పథకాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాలి.