బీఆర్ఎస్ కు ఖమ్మం సభ ప్లస్సా.. మైనస్సా?

బీఆర్ఎస్ ఖమ్మం సభ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నట్లు విజయవంతమైందా? విపక్షాలు చెబుతున్నట్లుగా అట్లర్ ప్లాప్ అయ్యిందా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ సభ బీఆర్ఎస్ లో జోష్ నింపిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ మొదలు పెట్టినప్పటి నుంచీ ఆయన చేసిన ప్రయత్నాలు నీరు గారిపోయాయన్న అభిప్రాయమే రాజకీయ వర్గాలలో వ్యక్త మౌతోంది. గతంలో సిఎం కెసిఆర్ పలు రాష్ట్రాలకు వెళ్లి మరీ కలిసిన సిఎంలను బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఆహ్వానించలేదా..?  ఆహ్వానించినా వారు రాలేదా..? అన్న ప్రశ్నలు భారాస వర్గాలలోనే వినిపిస్తున్నాయి.  

పలువురు సిఎంలతో చర్చించిన సిఎం కెసిఆర్ బీఆర్ఎస్ ఆవిర్బావ సబకు  వారినెందుకు దూరం పెట్టారన్నచర్చ సామాన్య జనంతో పాటుగా రాజకీయ వర్గాలలో కూడా జోరుగా సాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్, బిహార్ సిఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతాబెనర్జీ  వీరితో పాటు ఎన్సీపి అధినేత శరద్ పవార్, శి వసేన అధినేత  ఉద్దవ్ ఠాక్రే, రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వి యాదవ్ లను కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదు.. ఒక వేళ ఆహ్వానించినా వారు ఆ ఆహ్వానాన్ని మన్నించలేదా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ఆదిలోనే వారితో సిఎం కెసిఆర్ కు సయోధ్య కరువైందా...?  లేక బిఆర్ఎస్ తో వారు దూరంగా ఉండాలని భావిస్తున్నారా..? అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.

బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు వారెవరూ రాకపోవడం కేసీఆర్ తొలి అడుగులోనే జాతీయ రాజకీయాలలో తడబడ్డారా అన్న అనుమానాలను పరిశీలకుల వ్యక్తం చేస్తున్నారు. మోడీ ఇంటికి.. మేం ఢిల్లీకి అని ఖమ్మం సభ వేదికగా గంభీరంగా ప్రకటించిన కేసీఆర్.. కేవలం ఈ సభకు వచ్చిన ముగ్గురు, నలుగురు నాయకులతో ఎర్రకోటమీద జెండా ఎగురవేయగలనని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం సభకు వచ్చిన నాయకుల పార్టీలన్నీ కలిపినా కూడా పట్టుమని పాతిక లోక్ సభ స్థానాలు లేవు. అటువంటిది.. ఈ మద్దతుతో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేస్తానంటే నమ్మశక్యంగా లేదనీ, అతి విశ్వాసమో.. లేదా అతి అమాయకత్వమో తప్ప మరొకటి కాదనీ అంటున్నారు.  

జాతీయ స్థాయిలో రాజకీయం చేద్దామని భావిస్తున్న  సిఎం కెసిఆర్ కు  ప్రాంతీయ పార్టీల నుంచి ప్రతిబంధకాలు ఎదురౌతున్నాయన్న భావనా వ్యక్తమౌతోంది.   ప్రతి రాష్ట్రంలోనూ బిఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ ఉద్దేశానికి ఆయా రాష్ట్రాల్లోని అధికార ప్రాంతీయ పార్టీల నాయకత్వం   విముఖత ఎదురౌతోందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో బిఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కు ఆయా రాష్ట్రాలలో ప్రతికూలతలే ఎదురౌతున్నాయనీ, అందుకే ఇప్పటి వరకూ ఏపీలో వినా మరే రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ శాఖలు ఏర్పాటు కాలేదనీ విశ్లేషిస్తున్నారు.