మంచు విష్ణు దేనికైనా రెఢీ!.. ప్రకాశ్‌రాజ్ మోనార్క్ పాలిటిక్స్!
posted on Oct 13, 2021 1:24PM
ఏదో జరుగుతుందని అనుకున్నారు. మరేదో జరిగిపోయింది. ఆ తర్వాత ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. 'మా' ఎన్నికలు, ఫలితాలు.. మునుపెన్నడూ లేని రీతిలో సినిమాటిక్‌గా సాగాయి.. సాగుతున్నాయి. తెరవెనుక ఎవరు రచించిన స్క్రీన్‌ప్లేనో కానీ.. ఎవరూ ఊహించని విధంగా ట్విస్టులు అదిరిపోతున్నాయి. క్లైమాక్స్ సీన్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సినిమాల కంటే సినిమాటిక్‌గా నడుస్తున్న 'మా' ఎపిసోడే మరింత మజా ఇస్తోంది.
ప్రకాశ్‌రాజ్ 'మా' బరిలో నిలవగానే.. ఒక్కసారిగా అటెన్షన్. ఆయనకు మెగా సపోర్ట్ రాగానే మరింత అటెన్షన్. సినిమా బిడ్డలమంటూ ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్ గెలవకున్నా.. ఆయన ప్యానెల్ నుంచి 11మందికి పట్టం కట్టారు సినీ ఓటర్లు. ఇప్పుడు వారంతా పదవులకు రాజీనామా చేయడమంటే.. వారికి ఓటేసిన ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా అవమానించనట్టే..అంటున్నారు. వీళ్లేదో చేస్తారని నమ్మకముంచి ఓటేసి గెలిపిస్తే.. ఇప్పుడు మొదట్లోనే రాజీనామాలతో కాడి వదిలేయడమేంటని ఓటేసిన వారు ప్రశ్నిస్తున్నారు. గెలుపు-ఓటమిలను సమానంగా స్వీకరించే ధైర్యం లేనివారు.. ఇంతమాత్రానికే పోటీ చేయడం ఎందుకని నిలదీస్తున్నారు. 'మా' లో అంత రచ్చ రచ్చ జరిగాక.. చివరాఖరికి ఇప్పుడు రాజీనామాలతో చేతులెత్తేస్తే..? ఉపయోగం ఏంటి? 'మా' లో ఏవైనా అవకతవకలు జరిగితే అడిగే నాథుడెవరు? అంతా ఏకపక్షం అయితే.. అది ప్రజాస్వామ్య స్పూర్తికే విఘాతం కాదా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్మేస్తున్నారు నెటిజన్లు.
రాజీనామాలతో 'మా' నుంచి బయటకు రావటం కన్నా.. అసోసియేషన్‌లోనే ఉండి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏవైనా అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటే వాటిని ప్రశ్నించి గొంతుకలా ఉండి ఉంటే.. ‘మా’ కార్యకలాపాల్లో పారదర్శకత ఉండేదని అంటున్నారు. అసలు ‘మా’ ఎన్నికల్లో పోటీ లేకుండా పదవులన్నీ ఏకగ్రీవమైతే ఇన్ని గొడవలు, వివాదాలు జరిగి ఉండేవి కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆ దిశగా సినీ పెద్దలు చొరవ తీసుకోకపోవడం వల్లే పరిస్థితి చేదాటిపోయిందని, చివరకు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, గొడవలు, రాజీనామాలతో 'మా'లో ముసలం రాజుకుందని అంటున్నారు.
సరే, ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామా చేసేశారు. నెక్ట్స్ ఏంటి? మంచు విష్ణు ముందున్న ఆప్షన్లేంటి? అనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు విష్ణు ఏం చేస్తారనే దానిపై ఆసక్తి పెరిగింది. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే మంచు విష్ణు ముందు సవాళ్లు వచ్చి పడ్డాయి. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలతో విష్ణు ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయంటున్నారు. ఒకటి... 11మంది రాజీనామాలను ఆమోదించటం, రెండు.. వారి స్థానంలో కొత్త వారిని నియమించటం. ఒకరో ఇద్దరో రాజీనామా చేస్తే కాంప్రమైజ్ చేయొచ్చు. కానీ, ప్యానెల్ మొత్తం 11 మంది మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో మంచు విష్ణుకు వాటిని ఆమోదించి, వారి ప్లేస్‌లో వేరే వారిని తీసికోవడం మినహా మరో ఆప్షన్ లేదంటున్నారు. అయితే, పరిశ్రమ పెద్దలు చొరవ తీసుకొని ముందుకొచ్చి.. 'మా' గొడవలను పరిష్కరిస్తే బాగుంటుంది కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదంటున్నారు. ఆ పెద్దలే ఈ సమస్యకు కారణమని చెబుతున్నారు. దీంతో.. రాజీనామాల విషయంలో రాజీ ఉండకపోవచ్చని.. సై అంటే సైరా అన్నట్టే సాగుతుందని అంటున్నారు.