దిశ ఎన్ కౌంటర్ కేసులో సజ్జనార్ బుక్కవుతారా?
posted on Oct 13, 2021 1:10PM
తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనమైన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఏర్పాటైన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. నాటి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ను కమిటి రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రెండు రోజుల్లో 120 ప్రశ్నలను సజ్జనార్‌పై విచారణ కమిషన్ సంధించింది. పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. అడిగినప్రశ్నకే పరిమితమై నేరుగా సమాధానం చెప్పాలని విచారణ కమిషన్ స్పష్టం చేసింది. దీంతో సిర్పుర్కర్ కమిషన్ అడిగిన ప్రశ్నలకు సజ్జనార్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఆయన పరిస్థితి ఏంటి, ఐపీఎస్ అధికారి చిక్కుల్లో పడనున్నారా అన్న చర్చ సాగుతోంది.
విచారణ సందర్భంగా దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం తనకు తెలియదని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నిందితులను సీన్-రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసు అధికారులెవరూ తనకు చెప్పలేదని చెప్పారు.. 2019 డిసెంబరు 6 ఉదయం 6.15 గంటలకు ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్లు
శంషాబాద్ డీసీపీ తనకు సమాచారం ఇచ్చారని కమిషన్ కు వివరించారు సజ్జనార్. దిశ ఘటన తర్వాత ప్రజల్లో భయం నెలకొందని, డయల్-100, షీటీమ్స్‌పై అవగాహన కల్పించేందుకే 2019 నవంబరు 29న ప్రెస్‌మీట్ నిర్వహించానని సజ్జనార్ చెప్పడం ఆసక్తిగా మారింది.
అవగాహన కోసమైతే.. ఆ ప్రెస్‌మీట్‌లో ఏ1 నిందితుడి వాంగ్మూలాన్ని ఎందుకు వెల్లడించారని కమిషన్ ప్రశ్నించింది. కోర్టు పరిధిలోని అంశాన్ని మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు చెప్పారని నిలదీసింది. శంషాబాద్ డీసీపీ ఇచ్చిన సమాచారం మేరకు వెల్లడించానని సజ్జనార్ సమాధానం ఇవ్వడంతో.. ‘‘మీరు స్వతంత్రంగా ఆలోచించరా? మీకంటూ ఒక అభిప్రాయం
ఉండదా? అన్ని ప్రశ్నలకు శంషాబాద్ డీసీపీ అని సమాధానం చెబుతున్నారు? ఇంతకు మీరేం చేస్తారు?’’ అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబరాబాద్‌కు తాను శాంతిభద్రతల పర్యవేక్షణ ఇన్‌చార్జ్ అని, క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే సమాచారం మేరకు వ్యవహరిస్తారని చెప్పారు. ‘‘మీ కమిషనరేట్ పరిధిలో ఏం జరిగినా మీకు బాధ్యత ఉంటుంది కదా?’’
అని ప్రశ్నించగా.. ఆ వాదనతో తాను ఏకీభవించబోనన్నారు. దిశ అదృశ్య ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం జరిగింది వాస్తవమేనా? అని కమిషన్ ప్రశ్నించగా.. అవునని సమాధానమిచ్చారు. నిందితులను గెస్ట్‌హౌ్‌సలో ఉంచేందుకు తాను ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్థలంలో ప్రెస్‌మీట్ నిర్వహించడంపై కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతదేహాల పంచనామా పూర్తికాకుండానే ప్రెస్‌మీట్ పెట్టడమేంటని ప్రశ్నించింది. నాలుగు భాషల్లో సజ్జనార్ మాట్లాడటంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. సంఘటన స్థలంలో ప్రెస్‌మీట్ ఏర్పాటుకు కుర్చీలు, టేబుళ్లు ఎవరు సమకూర్చారని సజ్జనార్‌ను అడిగింది. ఈ ప్రశ్నలకు
తనకు తెలుగు సరిగా రాదని, 20 ఏళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్నా.. ఇక్కడ ఎక్కువ మంది హిందీ మాట్లా డుతారని చెప్పారు. ‘‘ఐపీఎస్ అధికారిగా తెలుగు భాష పరీక్ష రాయలేదా?’’ అని ప్రశ్నించగా.. 2000లోనే తెలుగు పరీక్ష పాసయ్యానని సజ్జనార్ చెప్పారు. తాను తెలుగు బాగా రాయగలనని, అంత వేగంగా మాట్లాడలేనని చె ప్పారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అంటూ పత్రికల్లో వచ్చిన కథ నాలపై ప్రశ్నించగా.. ఆ పదానికి అర్థం తెలియదని, తాను ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు కాదని చెప్పారు సజ్జనార్.
దిశ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, ఆ కేసును సజ్జనార్ తాను పర్యవేక్షించలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందని కమిషన్ వ్యాఖ్యానించింది. అది స్ట్రీట్ క్రైమ్ కాదని స్పష్టం చేసింది. కీలక కేసులో బాధ్యాతాయుతంగా వ్యవహరించాల్సిన సీపీ.. తనకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని నిలదీసింది. వేరే విషయాలతో తాను
బిజీగా ఉన్నానని, అందుకే కేసు దర్యాప్తును పర్యవేక్షించలేదని ఆయన సమాధానమిచ్చారు.
దిశ కేసులో కమిషన్ విచారణ తీరును బట్టి సజ్జన్నార్ సేఫ్ అని చెబుతున్నారు. మిగిలిన వారి మాదిరి ఎన్ కౌంటర్ మీద చెప్పిన సమాధానాలు కమిషన్ అసహనపడేలా ఉన్నప్పటికీ.. సాంకేతికంగా చూస్తే.. ఆయన్ను బుక్ చేసేలా మాత్రం లేవన్న మాట వినిపిస్తోంది. కొన్ని కీలకమైన ప్రశ్నలకు ఆయనకు తెలీదని చెప్పటం కానీ.. తాను పర్యవేక్షణ చేస్తుంటానని.. ఫాలో అప్ మాత్రమే తన బాద్యత అన్న రీతిలో సమాధానం ఇవ్వటం ఆయన మీద వేలెత్తి చూపించే పరిస్థితి కొంత మేర మాత్రమే ఉంటుంది తప్పించి.. చర్యలు తీసుకునే వరకు వెళ్లదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అదే సమయంలో ఈ ఉదంతం జరిగిన వేళలో శంషాబాద్ డీసీపీగా ఉన్న ప్రకాశ్ రెడ్డిని మరోసారి విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే విచారణను ఎదుర్కొన్న ఆయన.. సజ్జన్నార్ చెప్పిన సమాధానాలకు ఆయన తిరిగి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ విచారణ ఎపిసోడ్ లో సజ్జన్నార్ కంటే కూడా శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డికే ఎక్కువ ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.