కమలానికి ఓ దండం.. ఏపీ బీజేపీకి సీనియర్స్ రామ్ రామ్..
posted on Oct 13, 2021 4:12PM
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఉన్నదీ లేదు పోయేది లేదు. నిజానికి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, ఏపీలో బీజేపీ ఈ మాత్రంగా అయినా మిగిలింది, లేదంటే ఆ పార్టీని పట్టించుకునే నాథుడు కూడా ఉండక పోవునని ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది. కేంద్రంలో అధికారం లేకుంటే రాష్ట్రంలో ఈమాత్రం గుర్తింపు అయినా దక్కేది కాదేమో. అందుకే ఇప్పుడు ఏపీలో బీజేపీ ఉన్నది అంటే ఉన్నది, అంతే అంతకు మించి చెప్పుకునేందుకు ఏమీ లేదు, అన్న మాట రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అంతే కాదు, సమీప భవిష్యత్’లో రాష్ట్రంలో కమలదళం కనీసంగా అయినా పుంజుకునే అవకాశం ఏ కొంచెం కూడా లేదని అంటున్నారు.
నిజమే ఒకప్పుడు రాష్ట్రంలో బీజేపే సొంతంగా కనీసం ఒకటీ అరా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, ఇంకొంచెం ఎక్కువగా ఎమ్మెల్సీ సీట్లు అయినా గెలుచుకునేది. చదవు సంస్కారం ఉన్న మధ్యతరగతి వర్గాల్లో బీజేపీ అంటే కాసింత గుర్తింపు, కూసింత గౌరవం ఉండేవి. ఓట్లు వేసినా వేయక పోయినా ప్రజల్లోనూ బీజేపీ అంటే, ‘అదొక విభిన్న పార్టీ’ అనే గుర్తింపు, గౌరవం ఉండేవి. అప్పట్లో వెంకయ్య నాయుడు, జూపూడి యజ్ఞనారాయణ, పీవీ చలపతి రావు, ఎన్ఎస్ఎన్ రెడ్డి, డీఎస్పీ రెడ్డి వంటి నిబద్ధత, నిజాయతీ ఉన్న నాయకులు ఉన్నారు. అలాగే ఐడిలాజికల్ కమిట్మెంట్’తో నిస్వార్ధంగా పనిచేసే క్యాడర్ ఉన్న పార్టీగానూ లెఫ్ట్ పార్టీల రైట్ న చోటుండేది. ఇప్పుడు, పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. రాష్ట్రంలో బీజేపీకి సరైన నాయకత్వం లేదు. క్యాడర్’లో కూడా గతంలో ఉన్న అంకిత భావం ఇప్పుడు, కనిపించడం లేదు. సుదీర్ఘ కాలం పాటు, ఇతర పార్టీలతో కలిసి పనిచేయడం వల్లనో ఏమో, ఆ పార్టీల లక్షణాలు కొన్ని బీజేపీ క్యాడర్’కు కూడా అంటుకున్నాయి. సొంత ఖర్చులతో పార్టీ పనులు చేసిన పరిస్థితి నుంచి, అదేదో సినిమాలో కోట శ్రీనివాస రావు పాత్ర, ‘నాకేంటి?’ అని, చెయ్యి చాచినట్లు, ఇప్పుడు బీజేపీ క్యాడర్ చేయి చాస్తున్నారని అంటున్నారు.
కేంద్ర నాయకత్వానికి రాష్ట్రం మీద ఆశలు లేవు. కనీసం ప్రస్తుతానికి అయితే బీజేపీ జాతీయ నాయకత్వానికి , రాష్ట్రం పై దృష్తి కేద్రీకరించే ఆలోచన ఏ కొంచేమూ లేదు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. పార్టీలోనే కాదు, పార్టీ బయట కూడా ఇదే చర్చ జరుగుతోంది. అసలే పరిస్థితి అంత అద్వాన్నంగా ఉంటే, మూలుగే నక్కపై తాటి పండు పడినట్లు. ఇందులో మళ్ళీ మూడు ముఠాలు ఆరువర్గాలుగా పార్టీ కునారిల్లుతోంది. అందుకే, ఏదో ఆశించి, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడు, చేసిన తప్పుకు చెంపలు వేసుకుని కమలానికి ఓ దండం, అనేందుకు సిద్దమవుతున్నారని, విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఇప్పటికీ, ఒకప్పుడు క్రియాశీలంగా వ్యవహరించిన సీనియర్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నత కాలం, క్రియాశీలంగా వ్యవహరిస్తూ, నులుగురినీ కలుపుకు పోయారు. అయినా, రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఏమీ జరగక పోయినా, పార్టీలో కాసింత సందడి అయినా ఉండేది. కానీ,ఇప్పుడు పార్టీ రాష్ట్ర కార్యలయంలో కూడ సందడి కాదు కదా కనీసం చప్పుడు కూడ లేదంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, అలాగే తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యులు, సుజనా చౌదరి, సిఎం రమేష్,టీజీ వెంకటేష్ వంటి పార్టీని అన్ని విధాల ముందుకు తీసుకుపోయే, శక్తి సామర్ధ్యాలున్న నాయకులున్నా, ఐదో తనమే లోపించింది. ఈ నాయకులంతా కాషాయ కండువా కప్పుకుని, సంవత్సరాలు అవుతున్నా, పార్టీ కీలక నేతలు కొదంరు, ఇంకా, వారిని బయటి వ్యక్తులుగానే చూస్తున్నారు. బెంచ్ మీదనే ఉంచుతున్నారు,ఐటీ కంపెనీలో కొత్తగా చేరినారిని పని పాట లేకుండా బెంచి మీద కూర్చోపెట్టి నట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను, ఒక విధంగా అవమాలపాలు చేస్తున్నారు. చిన్నబుచ్చుకునేలా చూస్తున్నారని అంటున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఇటీవల పార్టీ సమావేశంలో, పార్టీ ముఖ్య నేత ఒకరు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీ పార్కింగ్ జోన్‌గా మారనిచ్చేది లేదంటూ చేసిన వ్యాఖ్యలు, సీనియర్లకు మనస్తాపం కలిగించాయి. అందుకే, పార్టీ అధిష్టానంతోతాడో పేడో తేల్చుకునేందుకు, బీజేపీ ‘బయటి’ నేతలు సిద్దమయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా,ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో కుమ్ముక్కై, పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారిన ‘దుష్ట త్రయం’ మీద చర్యలు తీసుకోవాలని, వారిని ఆయా స్థానాల నుంచి తప్పించాలని, సీనియర్ నాయకులు కోరుతున్నారు. అదే జరగక పోతే ... బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు ఒకరొకరుగా కాషాయ పార్టీకి రాం..రాం చెప్పడం, సొంత గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది