విశాఖ నుంచే పాలన.. జగన్ తాజా ప్రకటన సంకేతమేంటి?
posted on Apr 19, 2023 5:43PM
అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహస్తున్న ఏపీ సీఎం జగన్ తీరు పట్ల సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది. విపక్ష నేతగా సందర్భాల్లో అమరావతే రాజధాని అని విస్పష్టంగాప్రకటించారు. అంతే కాదు జగన్ ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో సాధించి తెస్తానన్నారు. పాతిక మంది వైసీపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకు వస్తానని వాగ్దానం చేశారు.
అయితే అధికారంలోకి వచ్చాకా ప్రత్యేక హోదానూ విస్మరించారు. అమరావతే రాజధాని అన్న విషయంలోనూ మడమ తిప్పేశారు. అమరావతి అభివృద్ధిని విస్మరించి మూడు రాజధానుల నాటకానికి తెరతీశారు. ఈ విషయంలో కోర్టులు అభ్యంతర పెట్టినా, అమరావతే రాజధాని అని ఏపీ హైకోర్టు విస్పష్టంగా చెప్పినా, హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించకపోయినా.. విశాఖ నుంచే పాలన సాగిస్తానంటూ ముఖ్యమంత్రి సహా ఆయన కేబినెట్ సహచరులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలలో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు బుధవారం (ఏప్రిల్ 19)న శంకుస్థాపన చేశారు. నౌపడా వద్ద పోర్టు నిర్వాసితులు కాలనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విశాఖ విషయంలో కీలక ప్రకటన చేశారు. అందరూ మెచ్చే నచ్చే నగరంకనుకే విశాఖను రాజధానిగా ఎంపిక చేసుకున్నామన్నారు. సెప్టెంబర్ నుంచి తాను విశాఖలోనే స్థిరపడతాను అక్కడ నుంచే పాలన కొనసాగిస్తానని విస్ఫష్టంగా చెప్పారు. వికేంద్రీకరణలో భాగమే ఇది అని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ గడువు డిసెంబర్ లో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు వస్తున్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా జగన్ విశాఖ నుంచే పాలన అన్న ప్రకటనకు ముడిపెడుతూ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్ ముందస్తుకు వెళతారని, అది కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే ఏపీ కి కూడా ఎన్నికలు జరిగేలా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారని అంటున్నారు.
అందులో భాగంగానే ఆయన సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన అన్న ప్రకటన చేశారంటున్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో ఉత్తరాంధ్రలో వైసీపీ ఓటమి.. విశాఖ రాజధాని ప్రతిపాదనకు అక్కడి జనం వ్యతిరేకించారనడానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో విపక్షాలపై చేసిన విమర్శలు.. తాను ఒంటరిగా పోరాడుతున్నానంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ముందస్తు సంకేతమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.