ది లెజండ్.. ది విజనరీ.. ది లీడర్.. ఒకే ఒక్కడు చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20 (గురువారం). సహజంగా ఎవరికైనా వయసు ముందుకు సాగుతుంది, వృధ్యాప్యం వైపు అడుగులు వేస్తుంది, కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో వయసు వెనక్కి, యవ్వనం వైపుకు అడుగులు వేస్తోందా అనిపించేలా, ఆయన వయసు పెరిగే కొద్దీ ఆయన కొత్త శక్తిని పుంజుకుని మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.  

 అవును, 73వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఆయనలో ఎక్కడ వార్ధక్యపు ఛాయలు కన్పించడంలేదు. అమృత మహోత్సవానికి అడుగు దూరంలో ఉన్న చంద్రబాబు నాయుడు నడకలో, నడతలో, ఆలోచనలలో ఎక్కడా వార్ధక్యపు  వాసనలు కనిపించడం లేదు. అందుకే, ఆయన ఈరోజుకు కూడా రాజకీయ రణక్షేతంలో అలుపెరగని యోదునిలా ముందుకు దూసుకు పోతున్నారు. రాష్ట్రంలో సాగుతున్న వైసేపీ అరాచక పాలనను అంతమొందించేందుకు తెలుగు దేశం సారథిగా శంఖారావాన్ని పూరించారు. సేనలను యుద్దానికి సిద్ధం చేస్తున్నారు. నిజానికి, గత సంవత్సరం ఇదే రోజున, 72 జన్మదినోత్సవం సందర్భంగా..చంద్రబాబు నాయుడు  వైసీపీ అరాచక పాలనపై యుద్ధాన్ని ప్రకటించారు. గత సంవత్సరం మే మొదటి వారంలో కుప్పంలో బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని ప్రారంభింఛి ఎన్నికల జైత్ర యాత్రకు అప్పుడే శ్రీకారం చుట్టారు. అదే నెలలో వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు.. మహానాడు తర్వాత ప్రతి 15 రోజులకి ఒక్క జిల్లాలో పర్యటించేలా, ప్రతి నెలా రెండు జిల్లాలు చొప్పున ఏడాదిపాటు రాష్ట్రమంతా పర్యటించేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు.

ఇక అక్కడి నుంచి బుధవారం(ఏప్రిల్ 19) వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశం వరకూ, ప్రతి క్షణం ప్రజలు, కార్యకర్తల మధ్యనే ఉన్నారు. అంతేకాదు, వై నాట్ 175 అంటున్న ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత ఇలాకాలో,  ‘వై నాట్ పులివెందుల’ అంటూ దీటైన సవాలు విసిరారు. నిజానికి, నిన్న మొన్నటి దాకా, మీటల మీద ఆశలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు మొదలైందంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు.ఆయన సాగిస్తున్న అలుపెరగని రాజకీయ పోరాటంమే. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో, టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక అక్కడి నుంచి జగన్ రెడ్డి ధీమా నీరుగారిపోయింది.  

ఆదలా ఉంటే, ప్రస్తుతం నుంచి గతంలోకి వెళితే, చంద్రబాబు నాయుడు జీవితం గురించి ప్రత్యేకించి చెప్పవలిసింది ఏమీ లేదు. ఏదీ ఉండదు. అవును..ఆయన జీవితం తెరిచిన పుస్తకం. గడచిన నాలుగు దశాబ్దాల అవిభక్త ఆంధ్ర ప్రదేశ్, రాష్ట్ర రాజకీయ చరిత్ర నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ, జీవిత చరిత్ర వేరు చేయడం కుదిరే వ్యహారం కాదు. ముఖ్యంగా 1995లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కోట్ల విజయభాస్కర రెడ్డి మొదలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డివరకు రాజకీయ ప్రత్యర్ధులు అనేక మంది వచ్చి వెళ్ళారు. చరిత్రకే పరిమితమయ్యారు. కానీ, చంద్రబాబు నాయుడు తిరుగులేని నాయకునిగా, ఇటు ముఖ్యమంత్రిగా అటు ప్రతిపక్ష నేతగా చరిత్ర సృష్టించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలో అత్యధిక కాలం సేవలు అధించిన  ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, సేవలు అందించారు.రాష్ట్ర విభజనకు ముందు తర్వాత  కూడా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఏకైక నాయకుడుగానూ చంద్రబాబు నాయుడు చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ ప్రతిపక్ష నేతగా అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నిఖార్సైన్ రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనంగా ఉన్నారు. 70 ప్లస్ వయస్సులోనూ అదే ఉత్సాహంతో, అదే దీక్షతో నవ్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 

నిజానికి చంద్రబాబు రాజకీయ అరంగేట్రం మొదలు, అయన రాజకీయ ప్రస్థానంలోని ప్రతి మలుపు మరో సంచలనంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయిందంటే అతిశయోక్తి కాదు. కాలేజీలో చదివే రోజుల్లోనే రాజకీయ చైతన్యం ఆయనలో మొగ్గ తొడిగింది. విద్యార్థి నాయకుడిగా తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్, హిస్టరీలో  విద్యను ముగించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ఎంఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పొందారు. 

ఈ దశలోనే క్రియాశీల రాజకీయాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. 1977లో దివిసీమ ఉప్పెన సందర్బంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సామాజిక సేవాభిలాషకు, మానవత్వానికి, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. చంద్రబాబు నాయకత్వ ప్రతిభను గమనించిన అగ్రనాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. 

ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ, సాంకేతిక విద్యా శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టడం చారిత్రాత్మకం. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, ఎన్టీఆర్‌ అసెంబ్లీని బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి చట్టసభల్లో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. 

1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధే  లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ చొరవగా వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు.  

జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి రథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డును ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్‌ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. 
దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్‌ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలనూ రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు. 

ముఖ్యంగా, యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బైట నుండి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్ర పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు.  

అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు విడిచి  నిరహారదీక్ష చేశారు. 
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్‌లో ఆరు రోజులపాటు నిరశన దీక్ష చేసి తెలుగు వారి సమస్యలను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు.  

దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా  7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్య పరిచారు.  
చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తూ ధైర్యం నింపుతున్నారు. అందుకే చంద్రబాబు ... కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, ఒక రాజనీజ్ఞునిగా చరిత్ర పుటల్లో  ఒకే ఒక్కడుగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu