ప్రకృతిలో త్రిగుణాలు ఎలా ఉంటాయి?

ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో అంటే కదలనివి (పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు), కదలకుండా కదిలేవి (చెట్లు, మొక్కలు, వృక్షములు), కదిలేవి (నాలుగు కాళ్ల, రెండు కాళ్ల జంతువులు, మనుషులు), మూడు గుణములు అంటే సత్వ రజో తమోగుణములు ఉన్నాయి అని తెలుసుకున్నాము.

ఉదాహరణకు, పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు, ఇవి కదలవు. వీటిలో తమోగుణము 98 శాతం ఉంటే రజోగుణము 1 శాతం సత్వగుణం 1 శాతం ఉంటుంది.

రెండవ రకం వృక్షములు, చెట్లు, మొక్కలు, అవి కదలవు కానీ నీటిని పీల్చుకుంటాయి, శ్వాసిస్తాయి. వాటి ఆకులు వివిధగుణములు కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు అయితే తన దగ్గరకు వచ్చిన జంతువులను తనలోకి లాక్కుంటాయి. కొన్ని తాకితే ముడుచుకుంటాయి. కొన్ని స్పందిస్తాయి. మొక్కలు పుట్టడం, పెరగడం, పెద్దవి కావడం మన కళ్లముందే జరుగుతుంది. కాని కదలలేవు. వీటిలో తమోగుణము 50శాతము, రజోగుణము 45 శాతము, సత్వగుణము 5 శాతం ఉంటుంది.

ఇంక జీవజాతులు, రెండు కాళ్ల మనుషులు, నాలుగు ఇంకా అనేక కాళ్లతో నడిచే జంతువులు, వీరిలో వారి వారి ప్రవృత్తులను బట్టి మూడు గుణాల నిష్పత్తి మారుతూ ఉంటుంది. జంతువులలో వాటి స్వభావాన్ని బట్టి గుణాలు ఒకేసారి మారతాయి.  కాని మానవుడికి వయసు పెరిగే కొద్దీ పరిసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, వారి వారి గుణాలు మారుతుంటాయి. కొంతమంది సాత్వికులు అవుతారు, మరి కొంత మంది రజోగుణ ప్రధానులు అవుతారు. మరి కొంత మంది తమోగుణ ప్రధానులు అవుతారు. అది ఎలాగంటే.

ఈ మూడు గుణములు పైన చెప్పబడిన వాటిలో ఒకే విధంగా, ఒకే మోతాదులో ఉండవు. హెచ్చుతగ్గులుగా ఉంటాయి. సత్వగుణము మోతాదు ఎక్కువగా ఉంటే, అది మిగిలిన రజో, తమోగుణములను అణగదొక్కుతుంది. తాను మాత్రమే ప్రధానంగా ప్రకటితమౌతుంది. అదే రజోగుణము ఎక్కువగా ఉంటే అది సత్త్వ, తమోగుణములను అణగదొక్కి తాను మాత్రమే ఎక్కువగా ప్రకటితమౌతుంది. అలాగే తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అది సత్వ, రజోగుణములను అణగదొక్కుతుంది. ఈ విధంగా ఒక్కొక్క పదార్థములో ఒక్కో గుణము ఎక్కువగా ఉంటుంది. కొందరిలో రెండుగుణాలు ఎక్కువ ఒక గుణము తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ మూడు గుణములు వివిధములైన పాళ్లలో బంధనములను కలుగజేస్తుంటాయి.

అంతే కాదు. ప్రతిరోజూ ప్రకృతిలో కూడా ఈ గుణాలు మారుతుంటాయి. సాధారణంగా మానవులలో ఉదయం 4 నుండి 8 వరకు సత్వగుణము ప్రధానంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలోనే స్నానం, సంధ్య, హెూమం, పూజ చేయాలని చెప్పారు. ఎండ ఎక్కేకొద్దీ రజోగుణము ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో ఎవరెవరికి నిర్దేశింపబడిన కర్మలు వారు చేయాలి. సూర్యుడు అస్తమించగానే, తమోగుణము ప్రధానంగా ఉంటుంది. కాబట్టి నిద్రపోవాలని చెప్పారు. (కాని మనం ఏం చేస్తున్నాము! ధన సంపాదన కొరకు, రాత్రిళ్లు పని చేస్తూ, పగలు కునికిపాట్లు పడుతున్నాము. లేక విలాసాలతో రాత్రి 1 గంటదాకా క్లబ్బులు పబ్బులలో గడుపుతూ నిశాచరులము అవుతూ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము.

కాబట్టి వివేకి అయినవాడు ఏ గుణమునకు బంధితుడు కాకూడదు. అన్నీ సమానంగా, పరిమితంగా అనుభవించాలి. దేనికీ అడిక్ట్ కాకూడదు. అతి, విపరీతధోరణి పనికిరాదు. శాస్త్రఅధ్యయనం చేయాలి. ఇష్టదైవాన్ని ఉపాసించాలి. ధ్యానం చేయాలి. జీవనానికి ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం ధర్మబద్దంగా, న్యాయబద్ధంగా, శ్రద్ధతో చేయాలి. అవసరము ఉన్నంత వరకే సంపాదించాలి. జీవితం ఆనందంగా గడపాలి. అంతేకానీ ఏదో ఒక గుణమునకు కట్టుబడి పోకూడదు.

 ◆ వెంకటేష్ పువ్వాడ.