ఈ  కొత్త డైట్ శరీరంలో కొవ్వును ఐస్ లా కరిగిస్తుందట!

ప్రస్తుతకాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది అధికబరువే... అయితే చాలా మంది తీరా బరువు పెరిగిన తరువాత బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వివిధ రకాల డైట్ లు ఫాలో అవుతుంటారు.  అలాంటి వాటిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గోలో డైట్. వినడానికి కాస్త వింతగా ఉంటుంది కానీ ఈ డైట్ వల్ల మంచి ఫలితాలు  ఉంటాయన్నది డైటీషియన్ల మాట. ఇంతకూ ఈ గోలో డైట్ ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీన్ని ఎలా ఫాలో అవ్వాలి? ఈ డైట్ లో ఏమి తినాలి? వంటివి తెలుసుకుంటే..

చాలామంది జీవనశైలి కారణంగా బరువు పెరుగుతారని అంటుంటారు.  కానీ అది వాస్తవం కాదని చెబుతున్నారు డైటీషియన్లు. వచ్చిన చిక్కల్లా తీసుకుంటున్న ఆహారం దగ్గరే. చాలామంది జీవనశైలికి తగిన ఆహారం ఎంచుకోవడం లేదని, అందుకే బరువు పెరుగుతున్నారని చెబుతున్నారు. దీనికి చక్కని ప్రత్యామ్నాయంగా గోలో డైట్ ను సూచిస్తున్నారు. దీనివల్ల శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించడం జరుగుతుంది. ఈ డైట్ వల్ల కొన్ని నెలల నుండి ఏడాది లోపు సుమారు 20కిలోల బరువు సునాయాసంగా తగ్గొచ్చట. ఈ డైట్ లో రోజువారీ 1300నుండి 1500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకంటూ ఉంటారు. దీంతో  పాటు డైటరీ సప్లిమెంట్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ కారణంగా  బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గోలో డైట్ ఆహారం ఎలా ఉంటుందంటే..

జంతు ఆధారిత ప్రోటీన్లు
గుడ్లు, పాలు, చీజ్,  పెరుగు
బ్రోకలీ, గుమ్మడికాయ వంటి తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలు.
కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, చియా గింజలు, అవిసె గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు.
బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు, పిస్తా మరియు వేరుశెనగ వంటి నట్స్.
బంగాళదుంపలు, చిలగడదుంపలు మరియు స్క్వాష్‌తో సహా ఇతర కూరగాయలు.
గోధుమ బియ్యం, వోట్మీల్ మరియు క్వినోవా వంటి తృణధాన్యాలు. ఈ డైట్ లో ప్రధానంగా తీసుకునే ఆహారాలు.

ఈ డైట్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్ వంటి ప్రమాదాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ డైట్ ప్లాన్ మంచిదే అయినా దీన్ని ఫాలో అయ్యే ముందు పోషకాహార నిపుణులను సంప్రదించి శరీర పరిస్థితిని బట్టి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

                                                               *నిశ్శబ్ద