పవన్ కల్యాణ్ కు ఏమైంది?
posted on Apr 16, 2025 10:23AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం (ఏప్రిల్ 15)న జరిగిన కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సెక్రటేరియెట్ వరకూ వచ్చారు. అయితే సమావేశానికి హాజరు కాకుండా ఆయన తన క్యాంప్ ఆఫీస్ కువెళ్లిపోయారు. ఆయన కేబినెట్ భేటీకి హాజరు కాకపోవడానికి బ్యాక్ పెయిన్ కారణంగా చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట కూడా ఆయన తీవ్రమైన బ్యాక్ పెయిన్ తో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో వైద్యులు కొన్ని రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఆయన విశ్రాంతి తీసుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ ఒక్క ఉపముఖ్యమంత్రే కాదు. ఆయన అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కూడా. కీలక శాఖల మంత్రిగా ఆయన తరచూ విస్తృత పర్యటనలు చేయడంతో ఆయన వెన్నునొప్పి తిరగబెట్టి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో ఉన్న సమ యంలో సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయ పడ్డాడు. దీంతో ఆయన అడవితల్లి బాట కార్యక్రమం ముగిసిన వెంటనే హుటాహుటిన సింగపూర్ బయ లు దేరి వెళ్లారు. ఆ తరువాత తన కుమారుడు మార్క్ శంకర్ ను ఎత్తుకుని విమానాశ్రయంలో కనిపించారు. అదే చివరి సారి ఆయన బహిరంగంగా కనిపించడం.
సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెళ్లారు. అక్కడ తలనీలాలు సమర్పించి, కుమారుడి పేరుమీద అన్నదానం కూడా చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వెళ్లలేదు. అందుకు కారణం కూడా ఆయన బ్యాక్ పెయినే అని భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన మంత్రివర్గ సమావేశానికి కూడా రాకపోవడంతో వెన్ననొప్ప తీవ్రంగా ఉందని భావించాల్సి వస్తున్నది.