లిక్కర్ స్కాం.. రెండు రోజుల ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి
posted on Apr 16, 2025 10:47AM

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం (ఏప్రిల్ 16) సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఈ నెల 18న హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన రెండు రోజుల ముందుగానే విచారణకు హాజరుకానున్నట్లు ఆయన సిట్ కు సమాచారం ఇచ్చారు. ఇందుకు సిట్ అంగీకరించింది. దీంతో ఆయన బుధవారం (ఏప్రిల్ 16)న సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సీపీ కార్యాలయంలో సిట్ అధికారులు విజయసాయిని విచారిస్తున్నారు.
ఇదే మద్యం కుంభకోణం కేసులో కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. హైదరాబాద్ లోని కసిరెడ్డి నివాసం, కార్యాలయాలలో సిట్ బృందం ఇటీవల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఈ కేసులో విజయసాయిరెడ్డిని విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కర్త, క్రియ, కర్మ కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని ఆరోపించిన సంగతి తెలిసిందే. అవసరమైన సమయంలో అందుకు సంబంధించిన విషయాలన్నీ వెల్లడిస్తానని కూడా విజయసాయిరెడ్డి అప్పట్లోనే చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన విజయసాయి ఇచ్చే వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారుతుందని సిట్ బృందం భావిస్తోంది.