పోలవరంలో సింహనాదం భయం గుప్పిట్లో 'దేశం'
posted on Apr 19, 2012 10:59AM
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందే తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర తిరుగుబాటు బాపుతా ఎగురవేశారు. తన తనయుడు రామ్మేహన్ కి టిక్కెట్టు ఇవ్వనందుకు నిరసనగా నియోజకవర్గ కన్వీనర్ పదవికి, టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షపదవికి రాజీనామా చేశారు. ఈయనకు వందలాది మంది అనుయాయులు మద్దతు ప్రకటించారు.
తాను మూడు దశాబ్దాలపాటు పార్టీ అభ్యున్నతికి పాటుపడ్డానని, ఈసారి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని సింగన్నదొర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. జిల్లా ఇన్ చార్జి సీతారామలక్ష్మి, సింగన్నదొరను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తానూ తన అనుచరులు పదవులకు రాజీనామా చేసినప్పటికీ పార్టీలోనే కొనసాగు తామని సింగన్నదొర చెప్పటం విశేషం. ఇప్పటికే సింగన్నదొర దెబ్బతో బెంబేలెత్తిపోతున్న తెలుగుదేశం నేతలకు ఆయన మరోసారి షాక్ ఇస్తారేమోనని భయపడుతున్నారు. తన కుమారుడిని పోలవరంలో తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దింపితే పార్టీ అభ్యర్థికి డిపాజిట్టు కూడా దక్కదని వారు భయపడుతున్నారు. అందుకే వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని నియోజకవర్గ నాయకులు కోరుతున్నారు.