మాచర్లలో అభ్యర్థుల కోసం కాంగ్రెస్, టిడిపి ల అన్వేషణ
posted on Apr 19, 2012 11:01AM
గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు అభ్యర్థిని ఎంపిక చేయలేక కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు సతమతమవుతున్నాయి.
కాంగ్రెస్ ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టిక్కెట్టు ఇస్తుందో చూసి తమ అభ్యర్థిని నిర్ణయించాలన్న యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆర్ధికబలం, అంగబలంతో పాటు సామాజికవర్గం అంశం కూడా కీలకపాత్ర వహిస్తుందని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గం అభార్తిని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తమ అభ్యర్థిగా తిరుమామిళ్ళ మధు, బొమ్మారెడ్డి, చెలమారెడ్డిలలో ఎవరో ఒకరికి టిక్కెట్టు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక విషయాన్ని చివరివరకూ సాగదీస్తే పార్టీకి నష్టం జరుగుతోందని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.