పరకాలలో టిడిపి పోటీ చేస్తుందా? లేదా?
posted on Apr 19, 2012 11:11AM
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పోటీపై ఇంకా సందిగ్ధం నెలకొనే వుంది. నిజానికి ఈ నియోజకవర్గంలో పార్టీ తరపున పోటీకి చల్లా ధర్మారెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆయన ఇప్పటిదాకా ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదు. దీనికి తోడు తెలంగాణా ఉద్యమ సాధన లక్ష్యంతో తెలంగాణా పార్టీలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే తాను పోటీనుంచి తప్పుకుంటానని తెలంగాణా టిడిపి ఫోరమ్ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు. నిజానికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ అభ్యర్థి గట్టిపోటీని ఇచ్చే అవకాహం కూడా కనిపించటం లేదు.
అయితే ఆ పార్టీ వ్యూహార్మకంగా ఉమ్మడి అభ్యర్థి కోసం పట్టుబట్టి టి.ఆర్.ఎస్. నాయకుడు చంద్రశేఖరరావు. జెఎసి కన్వీనర్ కోదండరామ్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణాపై ఏకాభిప్రాయం ఏర్పడితే టిడిపి అధినేత చంద్రబాబునాయుడితో తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన చేయిస్తానని ఎర్రబెల్లి దయాకర్ అంటున్నారు. ఈ నియోజకవర్గంలో చిన్న అవకాశం దొరికితే ఎన్నికల నుంచి వైదొలగాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి.