చంద్రబాబు పై అందుకేనా కుట్ర పన్నింది?

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ ఏంటీ అంటే వెంటనే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు గుర్తొస్తుంది. ఈ వ్యవహారం అంతలా రెండు రాష్ట్రాల రాజకీయాలలో వేడి పుట్టించింది మరి. కొంతమంది అయితే కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్త్తూ ఇంకా వివాదం చేయటానికి చూస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడానికి మాత్రం చూడట్లేదు. ఏదీ ఏమైనా ఈ కేసులో మాత్రం ఎవరికి ఎంత లాభం ఉందో తెలియదు కాని చంద్రబాబును ఇరికించడంవల్ల అటు కేసీఆర్ కు కానీ, ఇటు జగన్ కు కానీ రాజకీయపరంగా చాలా లబ్ధిచేకూరే అవకాశం ఉందనేది మాత్రం నిజమని విశ్వసనీయ వర్గాల వెల్లడి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బగొట్టడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాయి ప్రతిపక్షాలు.

 

అసలు కేసీఆర్, జగన్ కుమ్మక్కయి చంద్రబాబును కావాలనే ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని అటు తెదేపా శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. అందులో కూడా నిజం లేకపోలేదు అనే సందేహం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబును ఈ రొచ్చులోకి లాగటం వల్ల వారికి లాభం చేకూర్చే అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. అవేంటంటే ఏపీ రాజధాని నిర్మించాలన్నా దానిని అభివృద్ధి చేయాలన్నా తగిన పెట్టుబడి పెట్టాలి. ఇప్పటికే చంద్రబాబు సింగపూర్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లి వాళ్లతో చర్చించి ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకొచ్చారు. వారు కూడా చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్, ఆయన అడ్మినిస్ట్రేషన్ పై నమ్మకం.. చంద్రబాబు అనే ఒకే ఒక్క కారణం చేత పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నారు.

 

ఇప్పుడు ఈ కేసు ద్వారా ఆయనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బగొట్టి, మరక అంటిస్తే పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడతారని ఈ రకంగా కుట్రలు పన్నినట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే సీమాంధ్రాలో పెట్టుబడులు పెట్టే మేజర్ ఇన్వేస్టర్లు వెనక్కి తగ్గి హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెడితే ఆరకంగా హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల అటు కేసీఆర్ కు చాలా ఉపయోగం.. మరోవైపు ఈ కేసులో చంద్రబాబును ఇరికించి అతనిపై బురదపై చల్లడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ కు రాజకీయంగా చాలా లాభం ఉంటుంది.. ఏపీలో తన ఉనికిని చాటుకోవచ్చు.. ఈ రెండు కారణాలతో కేసీఆర్ తో కుమ్మక్కయి చంద్రబాబుపై ఎదురుదాడికి దిగారని రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఏపీ రాజధాని కోసం శ్రమిస్తున్నచంద్రబాబును చూసి తెలంగాణలో కూడా తెదేపా అధికారంలోకి వస్తుందనే భయంతో అటు కేసీఆర్, ఆంధ్రాలో వైకాపా పరిస్థితి ఏమవుతుందో అన్న భయంతో ఇటు జగన్ ఇద్దరు కలిసి ఇలాంటి కుట్రకు పాల్పడ్డారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.