తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌ ఖాయం‌.. కొండా సురేఖపై వేటు తథ్యం?

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం కుద‌ర‌డం లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్ర‌తీసారి క్యాబినెట్ విస్త‌ర‌ణ‌పై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మాత్రం జ‌ర‌గ‌డం లేదు. దీంతో మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న‌వారికి నిరాశే ఎదుర‌వుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ప‌ది నెల‌లు అవుతోంది. అయినా పూర్తిస్థాయి కేబినెట్ లేక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేబినెట్ విస్త‌ర‌ణ‌కు రేవంత్ రెడ్డికి   పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ద‌స‌రా త‌రువాత  ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే విష‌యంపై టీపీసీసీ చీఫ్  మ‌హేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. ద‌స‌రా త‌రువాత ఎట్టి ప‌రిస్థితుల్లో కేబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని చెప్ప‌డంతో.. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వారు త‌మ ప్ర‌య‌త్నాల‌ను మ‌రోసారి షురూ చేశారు. అయితే, ఈసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణంలో మంత్రి కొండా సురేఖ‌కు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో మ‌రో బీసీ ఎమ్మెల్యేను మంత్రిగా తీసుకుంటార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.  

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌మ‌యంలో ఆయ‌న‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో మొత్తంగా తెలంగాణ కేబినెట్‌లో 12 మంది కొలువుదీరారు. కేబినెట్‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి న‌లుగురు, బీసీ, ఎస్సీ సామాజిక వ‌ర్గాల నుంచి ఇద్ద‌రు చొప్పున‌, ఎస్టీ, క‌మ్మ‌, వెల‌మ సామాజిక వ‌ర్గాల నుంచి ఒక్కొక్క‌రు చొప్పున ఉన్నారు. మ‌రో ఆరు బెర్త్ లు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం కేబినెట్‌లో నాలుగు ఉమ్మ‌డి జిల్లాల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించ‌లేదు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆ నాలుగు జిల్లాల‌కు క‌చ్చితంగా చోటు క‌ల్పించాల్సి ఉంటుంది. మ‌రో వైపు కేబినెట్ విస్త‌ర‌ణ‌లో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఇప్ప‌టికే జిల్లాల వారిగా ఆశావ‌హ ఎమ్మెల్యేలు అధిష్టానానికి విన్న‌వించుకున్నారు. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వారి పేర్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి గ‌తంలోనే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధిష్ఠానం కూడా సామాజిక వ‌ర్గాల వారిగా, జిల్లాల వారిగా మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల్సిన వారి పేర్ల‌ను  ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది.  మొత్తం ఆరు బెర్త్ లు ఖాళీ ఉండ‌గా.. ప్ర‌స్తుతం జ‌ర‌బోయే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో నాలుగు మంత్రి ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తార‌ని తెలుస్తోంది. వీరిలో ఏఏ సామాజిక వ‌ర్గాల వారికి అవ‌కాశం క‌ల్పిస్తార‌నే ఆంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చర్చ జరుగుతోంది. 

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప్ర‌స్తుత మంత్రి కొండా సురేఖ‌పై వేటు ప‌డుతుంద‌ని కొద్ది రోజులుగా తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఆమె కేటీఆర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడే స‌మ‌యంలో హీరో నాగార్జు కుటుంబంపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ఇందుకు కారణంగా తెలుస్తోంది. నాగచైత‌న్య‌, స‌మంత విడిపోవ‌డానికి కేటీఆర్ కార‌ణ‌మ‌ని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాక బాలీవుడ్ హీరోయిన్ల ప్ర‌స్తావ‌న తెస్తూ కేటీఆర్ పై విమ‌ర్శ‌లు చేశారు. సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించాయి. హీరో నాగార్జున, ఆయ‌న కుటుంబం మంత్రి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుంది.  టాలీవుడ్‌ సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖ‌లు నాగార్జున‌కు మ‌ద్ద‌తుగా నిలిచి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ఓ విధంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై యుద్ధ‌ భేరి మోగించిన‌ట్ల‌యింది. వివాదం పెద్ద‌ది కావ‌డంతో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్య‌ల‌ను కొండా సురేఖ వెన‌క్కు తీసుకున్నారు. హీరోయిన్ స‌మంత‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయినా శాంతించ‌ని నాగార్జున ఆమెపై నాంప‌ల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు.

ఇటీవ‌ల నాగార్జున‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు  నాంప‌ల్లి కోర్టుకు హాజ‌ర‌య్యారు. తాజాగా కేటీఆర్ సైతం కొండా సురేఖపై నాంప‌ల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా కొండా సురేఖ వ్యాఖ్య‌లు చేశార‌ని కోర్టులో పిటీష‌న్ వేశారు. వీటికి సంబంధించి నాంప‌ల్లి కోర్టు కొండా సురేఖ‌కు నోటీసులు  జారీ చేసింది. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గం విస్త‌ర‌ణ‌లో ఆమె మంత్రి ప‌ద‌వి పోవ‌టం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీలోనూ చ‌ర్చ మొద‌లైంది. ఈ విష‌యంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొలిగించే ఆలోచ‌న‌లో అదిష్టానంకు లేద‌ని చెప్పారు. తాజా విష‌యంపై ఆమెను అధిష్టానం వివ‌ర‌ణ కూడా కోర‌లేద‌ని, ఇదంతా రాజ‌కీయంగా కొండా సురేఖ‌పై బీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న అస‌త్య ప్ర‌చారం అన్నారు. కేటీఆర్ ను విమ‌ర్శించే క్ర‌మంలో భావోద్వేగానికి గురై ఆమె నాగార్జున కుటుంబానికి సంబంధించి వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆ త‌రువాత త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకున్నార‌ని గుర్తుచేశారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణంలో కొండా సురేఖపై వేటు ప‌డుతుంద‌న్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని తేల్చిచెప్పారు. మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డికూడా కొండా సురేఖ‌కు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని, దీంతో ఆమెకు మంత్రి ప‌ద‌వికి వ‌చ్చిన ప్ర‌మాద‌మేమీ లేద‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు.