రామాంజనేయులుకు వట్టి మొట్టికాయలు
posted on Apr 5, 2012 10:45AM
వివాదాస్పద విశాఖ జివిఎంసి కమీషనర్ బి.రామాంజనేయులు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అయిన వట్టి వసంతకుమార్ ఆగ్రహానికి బలైపోయారు. స్వతహాగా రామాంజనేయులు కోపిష్టి. ఎవరన్నా ఏదన్నా అంటే ఆయన సహించరు. గతంలో ఆయన తన సీనియర్లను కూడా ఎదిరించిన సందర్భాలున్నాయి. ఇటువంటి మనస్తత్వంగల రామాంజనేయులుని వట్టి వసంతకుమార్ గట్టిగా మందలించడం సంచలనం కలిగించింది.
విశాఖ తీరంలోని ఆర్కెబిట్ రోడ్డులో ఎప్పటినుంచో వ్యాపారాలు చేసుకుంటున్న కొందరు వ్యక్తులు మంత్రి వట్టి వసంతకుమార్ కు కమీషనర్ పై ఫిర్యాదు చేశారు. తమను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని, షాపులను అక్రమంగా కూల్చివేస్తున్నారని బోరు బోరున విలపిస్తూ చెప్పడంతో వట్టి వసంతకుమార్ వెంటనే ప్రక్కనే ఉన్న రామాంజనేయులుపై గట్టిగా అరవడం ప్రారంభించారు. కోర్టు అదేశంతోనే తాను ఈ పనిచేస్తున్నట్లు కమీషనర్ చెప్పబోతున్నప్పటికి వసంతకుమార్ వినిపించుకోలేదు. తాను చెప్పిందే చేయాలి తప్ప తనకు ఎదురు మాట్లాడవద్దని మంత్రి ఆయనపై మండిపడ్డారు. అనంతరం కమీషనర్ వట్టి వసంతకుమార్ తన గదిలోకి తీసుకువెళ్ళి మరోసారి తలంటుపోసినట్లు తెలుస్తుంది. వట్టి వసంతకుమార్ ఆగ్రహం వెనుక ఇతర కారణాలు కుడా ఉన్నాయి. కమీషనర్ రామాంజనేయులు ఒంటెద్దు పోకడలను స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిథులు కూడా సహించలేకపోతున్నారు. వారు తరచు రామాంజనేయులుపై వత్తికి ఫిర్యాదులు చేస్తున్నారు. సమయంకోసం వేచి చూస్తున్న వత్తికి ఒక సాగు దొరకడంతో రామాంజనేయులుపై ఉన్న కోపాన్నంతా తీర్చుకున్నారు.