అధిష్టానం పరిశీలనలో గల్లా, వెంకటరమణ పేర్లు
posted on Apr 5, 2012 10:22AM
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ, తరపున పోటీచేసే అవకాశం మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సుమారు పాతిక మంది ఆశావహులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని కలుసుకుని తమ పేర్లను పరిశీలించవలసిందిగా కోరారు. అయితే చివరకు వీరు గల్లా జయదేవ్ లేదా వెంకటరమణ పేర్లను ఖరారు చేశారు. ఈ రెండు పేర్లను అధిష్టానానికి పంపి వారిద్దరిలో ఎవరికీ టిక్కెట్ ఇవ్వమంటే వారిని అభ్యర్ధిగా ప్రకటించబోతున్నట్లు తెలిసింది. గల్లా జయదేవ్ కు ఈ ప్రాంతంలో అర్ధబలంతో పాటు అంగబలం కూడా ఉంది. అవసరమైతే ఎన్నికలో రూ. 10 నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి గల్లా కుటుంబం సిద్ధంగా ఉన్నర్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా వీరివైపే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో చిరంజీవికి అయిన ఎన్నికల వ్యయాన్ని గల్లా కుటుంబం తిరిగి ఆయనకు చెల్లించేందుకు సిద్దపడినట్లు తెలిసింది. దీంతో చిరంజీవి గల్లా కుటుంబంవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కూడా గట్టిగానే తన ప్రయత్నం చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఆయన సుమారు 40వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు టిక్కెట్ రాకుండా చేశారు. అయినప్పటికీ తాను జనంలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానని, తన సామాజికవర్గానికి చేనిన ఓటర్లు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారని ఎమ్మెల్యే వెంకటరమణ వాదించారు. అధిష్టానానికి పంపిన పేర్లలో మరీ ఒక్క పేరే పంపిస్తే బాగుండదనే ఉద్దేశంతో గల్లా జయదేవ్, వెంకటరమణ పేర్లను పంపినట్లు తెలిసింది. కాని టిక్కెట్ మాత్రం గల్లా జయదేవ్ కు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.