రాధా - రంగా మిత్రమండలిలో విభేదాలు?
posted on Apr 6, 2012 7:21AM
వంగవీటి రాధాకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న నిర్ణయంపై రాధారంగా మిత్రమండలిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంగవీటి రంగా హత్యానంతరం విజయవాడలో రాధా రంగా మిత్రమండలి ఏర్పడింది. ఈ సంఘానికి కోస్తా ఆంధ్రా అంతటా సానుభూతిపరులు మద్దతుదారులు ఉన్నారు. వంగవీటి కుటుంబానికి వీరు వెన్నుదన్నుగా ఉంటున్నారు. వంగవీటి రత్నకుమారి ఎన్నికల సమయంలో కూడా వీరు ఆమెకు గట్టి మద్దతునిచ్చారు. అయితే రాధా విషయానికి వచ్చేటప్పటికి మిత్రమందలిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ లో ఉంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉన్నప్పటికీ రాధా పి.ఆర్.పి.లో చెరి ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఆయన రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. క్యాడర్ కూడా చెల్లాచెదురు అయిపోతున్న నేపథ్యంలో ఒకప్పుడు వంగవీటి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న శాసనసభ్యులు మల్లాది విష్ణు వీరందరినీ చేరదీయడం ప్రారంభించారు. అయినా క్యాడర్ ను నిలుపుకోవడానికి రాధా పెద్దగా ప్రయత్నించలేదు. ఇప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన రాధా రంగా మిత్రమండలి సహాయసహకారాలను కోరుతున్నారు.
రాధా నిర్ణయానికి కొంతమంది సభ్యులు వ్యతిరేకత చూపించినప్పటికీ చివరకు రాధా రంగా మిత్రమండలి ఆయనకు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. అయితే గతంలోలాగా ఈ మిత్రమండలి రాధాకు మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించకపోవచ్చునని తెలుస్తోంది. విజయవాడ నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జలీల్ ఖాన్, గౌతమ్ రెడ్డి ప్రధాన నాయకులుగా ఉన్నారు. ఈ నగర పరధిలో మూడు అసెంబ్లీ టిక్కెట్లు ఉన్నాయి. పశ్చిమానికి జలీల్ ఖాన్, తూర్పుకు గౌతమ్ రెడ్డి పేర్లు ఖరారు కావడం ఖాయం. సెంట్రల్ నియోజకవర్గ టిక్కెట్ ను వంగవీటి రాధాకు ఇస్తారనే ఊహాగానాలు వినవస్తున్నాయి. ఇదే జరిగితే విజయవాడ నగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిపట్టు సాధించే అవకాశం ఉంది. జలీల్ ఖాన్, గౌతమ్ రెడ్డికి తమ తమ ప్రాంతాల్లో గట్టిపట్టు ఉంది. వీరికి రాధా కూడా తోడయితే వైయస్సార్ కాంగ్రెస్ పాటీ పరిస్థితి నగరంలో మరింత మెరుగుపడుతుంది.