సక్సెస్ వెంట రావాలంటే దీన్ని నమ్మాలి!

మనిషి జీవితంలో పనులను చేసే విధానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. సాధారణంగా చేసిన పనికి సాధారణమైన పలితం ఉండొచ్చు, అదే పనిని మరింత కష్టపడి చేస్తే ఆ పనికి దక్కే ఫలితం మరింత గొప్పగా ఉండొచ్చు. అంటే  దక్కే ఫలితం అంతా చేసే విధానంలోనే ఉంటుంది.  కష్టపడి పనిచేస్తే దేనినైనా సాధించవచ్చు. అందుకే కష్టేఫలి అన్నారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది. కష్టపడి అంకితభావంతో పనిచేయటం ప్రారంభిస్తే విజయాలు వాటంతటవే వస్తాయి. కష్టపడకుండా అన్నీ కావాలనుకోవటం అసమర్థత అవుతుంది. అసమర్థత మాత్రమే కాదు మనుషుల్లో ఉన్న మూర్ఖత్వం కూడా అదే. అలా అనుకునే వారు ఎప్పటికీ ఏమీ సాధించలేరు. కాబట్టి విజయాలు సాధించడానికి వంకర మార్గాలు, సులువైన దారులు, వేరే ఇతర ఆలోచనలు ఏమీ ఉండవు.  కేవలం కష్టపడాలి. కొందరు డబ్బు అడ్డు పెట్టుకుని పనులు విజయవంతం చేసుకుంటారు. అపుడు అది విజయం అవ్వదు. కష్టపడి సాధించుకునేది మాత్రమే విజయం అనబడుతుంది.

కష్టపడితే దేనినైనా సొంతం చేసుకోవచ్చు. కష్టపడి అంకితభావంతో పనిచేయగలగటమే అదృష్టం! కష్టపడి పనిచేసే అవకాశం లభించడమే ఒక అదృష్టం! అటువంటి అదృష్టం మనల్ని వరిస్తున్నప్పుడు మనం తలుపులను మనస్సుని మూసుకుని కూర్చుంటే ఏ ప్రయోజనాన్నీ పొందలేము. అవకాశాలు మనల్ని వరిస్తున్నప్పుడు మనం అందుకోవడానికి సిద్ధంగా వుండాలి. 

రోదసి ప్రయోగానికి సిద్ధంగా వున్న ఏస్ట్రోనాట్ లాగా, సముద్రగర్భంలోకి వెళ్ళే డైవర్లాగా సిద్ధంగా వుండాలి. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఆపరేషన్ కి కావలసిన వస్తువులన్నీ ముందుగా ఆపరేషన్ థియేటర్ తో సహా సిద్ధం చేసుకుంటారు. వ్యాపారం చేసేవారు వ్యాపారానికి కావలసిన అవకాశాలతో సిద్ధంగా ఉంటారు. ఇలా ప్రతిదానికి సిద్ధంగా ఉండటం ఎంత ముఖ్యమో, విద్యార్థులు పరీక్షల కోసం కావలసిన మెటీరియల్ తో సిద్ధంగా ఉండటం అంతే అవసరం. ప్రతి విషయంలోనూ కష్టపడే గుణం అలవరచుకోవాలి. ఎందుకంటే కష్టం వెనకాలే ఫలితం కూడా ఉంటుంది. కష్టపడడం వల్ల మన శ్రమ ఏమీ వృధాకాదు. అందుకు సంబంధించిన ఫలితం ఇవ్వాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండు కాకపోతే ఇంకొకరోజు ఇలా ఎప్పటికైనా ఆ ఫలితం లభిస్తుంది.

'చేతకానితనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు' అంటారు ఓ మహానుభావుడు. 

మనిషిలో  చేతకానితనం ఉన్నప్పుడు, ఆ మనిషి తన వైఫల్యాలకు కారణంగా జాతకాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుందా?? అలాగే నాసిరకంగా, ఒకరికి నమ్మకం ఇవ్వలేని సరుకు పెట్టుకుని అసలు అమ్మకం అనే విషయం గురించి ఎందుకు అరవాలి. సరుకు మంచిది అయితే కొనకుండా ఉంటారా ఎవరైనా?? ఈ చేతకానితనం, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి జాతకాలను, బయట పరిస్థితులను సాకుగా చూపెడితే మనిషికే నష్టం తప్ప బయటివాళ్లకు ఏంటి నష్టం??


మనలో సమర్ధవంతమైన నైపుణ్యాలు ఉండాలి. అప్పుడు జీవితంలో విజయాలు సాధిస్తాము. జీవితంలో అరుదుగా వచ్చే అవకాశం లభించినపుడు మీనమేషాలు లెక్కించుకుంటూ వెనుకాడకూడదు. అదృష్టం వరించినంత కాలం మన తెలివితేటలే దానికి కారణం అని చెబుతుంటాము. దురదృష్టం వెంటాడు తున్నప్పుడు దానికి కారణం జాతకాలని, వాస్తు అని చెప్పడం మంచి పద్ధతి కాదు.

భారతదేశంలో చాలామంది సంపన్నులు తమ స్వయం కృషితో ఎదిగిన వారే కాని, వారసత్వం మీద వచ్చిన వారుకాదు. కష్టపడితే ఫలితం లభిస్తుందన్న నమ్మకం కలిగివుంటే విజయాలను సొంతం చేసుకోవచ్చు. కష్టించి పనిచేస్తే భవిష్యత్ మన గుప్పిట్లోనే వుంటుంది. అందుకే కష్టాన్ని నమ్మితే బాగుపడే వాడే కానీ చెడిపోయేవాడు లేడు ఈ ప్రపంచంలో. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే కష్టం వైపు క్రమంగా నడుస్తారు ఖచ్చితంగా.

                                     ◆నిశ్శబ్ద.

Related Segment News