జగన్ ను విస్మరించి మరీ కేటీఆర్ పై విజయసాయి పొగడ్తలు.. సంకేతమేంటి?

జగన్, విజయసాయిరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? వైసీపీకి రాజీనామా చేసిన తరువాత విజయసాయిరెడ్డి జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. నేరుగా జగన్ ను ఉద్దేశించి విమర్శనాత్మక వ్యాఖ్యలు ఏమీ చేయకపోయినా.. విజయసాయి మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారీ, అలాగే ఎక్స్ వేదికగా పెట్టిన ప్రతి పోస్టులోనూ జగన్ ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.

పైగా అవసరం, అవకాశం లేకపోయినా.. కల్పించుకుని మరీ జగన్ కు ఇబ్బందులు, చిక్కులు తెచ్చిపెట్టే వ్యాఖ్యలు, పోస్టులు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాకినాడ పోర్టు కేసులో సీబీఐ విచారణకు హాజరైన విజయసాయి.. ఆ కేసుకు సంబంధించి కర్త, కర్మ, క్రియా అన్నీ జగన్ కు బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే అని మీడియా ఎదుట కుండబద్దలు కొట్టేసి జగన్ కే కాదు.. మొత్తం వైసీపీకి షాక్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా, అదే మీడియా సమావేశంలో అసందర్భంగానే అయినా అత్యంత వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ మద్యం కుంభకోణం వెనుక ఉన్నది కసిరెడ్డి రాజశేఖరెడ్డేనని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అవసరమైతే ముందు ముందు వెళ్లడిస్తానంటూ ఉత్కంఠ రేపారు. జగన్ లో ఆందోళన నింపారు. అయితే విజయసాయి వెల్లడించే వరకూ ఆగకుండా నెటిజనులు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యవహారం అంతా సోషల్ మీడియాలో గుమ్మరిం చేశారు.

ఇక ఇప్పడు తాజాగా విజయసాయి చెన్నై వేదికగా తమిళనాడు  ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన డిమిటేషన్ వ్యతిరేక సదస్సు విషయంలో విజయసాయి తనదైన స్టైల్ లో స్పందించారు. రాజకీయాల నుంచి వైదొలిగిన విజయ సాయి డీమిటేషన్ విషయంలో జగన్ ను పూర్తిగా విస్మరించి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మద్దతుగా ఎక్స్ వేదికగా స్పందించారు.  డిలిమిటేష్ పై కేసీఆర్ ప్రతిమాటకూ మద్దతు తెలిపిన విజయసాయి.. వ్యూహాత్మకంగా జగన్ ను విస్మరించారు. కేవలం జనాభా ప్రాతిపదికన డీమిలిటేషన్ పై దక్షిణాది రాష్ట్యాల ఆందోళనతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్ననని పేర్కొన్న విజయసాయి.. తన ట్వీట్ లో ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీకి చేసిన కంట్రీబ్యూషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కేసీఆర్ సూచించారు. దీనిపైనే ఎక్స్ వేదికగా విజయసాయి స్పందించారు. అయితే డీలిమిటేషన్ ను వ్యతిరేకించిన జగన్  గురించి మాత్రం ఈ మాజీ వైసీపీ నేత కనీసం ప్రస్తావించలేదు. జగన్ పేరు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నట్లుగా ఆయన ట్వీట్ ఉంది. ఈ విధంగా జగన్ ను విస్మరించడం ద్వారా విజయసాయి.. జగన్ పట్ల తన అయిష్టతను, వ్యతిరేకతను ప్రస్ఫుటంగా చాటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి ఈ తీరు ముందు ముందు జగన్ ను చిక్కుల్లోకి నెట్టడం ఖాయమని అంటున్నారు.