ధర్నాలతో భగ్గుమన్న బెజవాడ
posted on Jun 25, 2012 10:53AM
బెజవాడ రాజకీయం భగ్గుమంటోంది. ఫ్లైవోవర్ నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ధర్ణాలు చేశారు. మరోవైపు రైతుసమస్యలపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు ప్రారంభించారు. ఫలితంగా ప్రజలు తీవ్ర అగచాట్లకు గురయ్యారు. విజయవాడ కనకదుర్గగుడి హైవే వద్ద ఫ్లయిఓవర్ నిర్మించాలనే డిమాండుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యాన ఆ పార్టీ ధర్నాకు దిగారు. దీన్ని ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు.
ఇప్పుడే ఫ్లయిఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యలు తప్పవని ఎంపి లగడపాటి రాజగోపాల్ అబిప్రాయపడ్డారు. ఆల్‌రెడీ ఫ్లయిఓవర్‌కు నిధులు మంజూరైతే ఎందుకు పనులు ప్రారంభించలేదని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. తన అభిప్రాయం చెప్పిన రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ తరుపున నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు సుముఖంగా లేరు. అయినా నిరసన కార్యక్రమం ఆగదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి. అయితే తెలుగుదేశం మెరుపుధర్నా వల్ల ట్రాఫిక్ సమస్య తప్పదనీ, ముందస్తుగా చేయాల్సిన ఏర్పాట్లు గురించి పోలీసుశాఖ అప్రమత్తమైంది.
బాబు మెరుపుధర్నా వెనుక పలు ఆసక్తికరమైన అంశాలున్నాయి. విజయవాడలో ప్రారంభించిన ప్రతీ ఆందోళన సక్సస్ అవుతుందన్నది సెంటిమెంటు. దీనికి ఉదాహరణ ఆంథ్రరాష్ట్ర అవతరణ. బెజవాడ ఉద్యమాల పురిటిగడ్డ వంటిదని ప్రస్తుతిస్తారు. అంతేకాకుండా తాజాగా వై.కా.పా. అథినేత జగన్మోహనరెడ్డి ఇక్కడ రైతాంగ సమస్యలపై పోరాటం ప్రారంభించి మంచి పేరు సంపాదించారు. ఒకరకంగా చెప్పాలంటే జగన్ చేసిన ఈ ఆందోళనే ఉప ఎన్నికల ఫలితాల్లో అంతలా గెలుపుగుర్రం ఎక్కడానికి కారణమని ఆ పార్టీనేతలు విశ్లేషించారు కూడా. అందువల్ల చంద్రబాబు ఆ దుర్గమ్మపై భారం పెట్టి మెరుపు ధర్నాకు సిద్ధమయ్యారు.