పరకాల కాంగ్రెస్‌కు పగ్గాల్లేవా?
posted on Jun 25, 2012 11:05AM
కాంగ్రెస్‌పార్టీ పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలకు , నేతలకు మద్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. వీరిని అదుపులో పెట్టడం పార్టీ నాయకత్వానికి పెద్ద సమస్యగా మారింది. అందుకే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. కుర్చీలు విరిచేస్తారు. రోడ్డెక్కి వాహనాలు ఆపేసి ధర్నాలు చేసేస్తారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో ఓటమి చవి చూసినా నేతలూ, కార్యకర్తల్లో మార్పు రాలేదేమిటీ అని పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు.
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీకి ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్టు కూడా దక్కలేదు. అయినా సరే! అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలూ, నేతలూ విర్రవీగుతూనే ఉన్నారు. ఈ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కోసం రూపొందించిన ఫ్లెక్సీలో గండ్రవెంకట రమణారెడ్డి ఫొటో చిన్నదిగా ఉన్నదంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో మంత్రులు, కొందరు నేతలూ వై.కా.పా.కు అమ్ముడుపోయారని కొందరు కార్యకర్తలు ఆరోపించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. కుర్చీలు గాల్లోకి లేచాయి. ఓ రణరంగ వాతావరణం సృష్టించారు. సమావేశ మందిరం వద్ద విరిగిన కుర్చీలు కాంగ్రెస్ క్రమశిక్షణకు సాక్ష్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శల గురించి పట్టించుకోని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు ప్రధానరహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ప్రజలు తీవ్ర అసహనం ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు ఇలా చేయడం వల్లే డిపాజిట్లు కూడా కోల్పోయారని ప్రజలు విమర్శిస్తున్నారు.