వంగవీటికి జగన్ ఇచ్చిన హామీ ఏమిటి?
posted on Apr 21, 2012 10:21AM
2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు ఇచ్చే ఒప్పందంతోనే వంగవీటి రాధాకృష్ణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ప్రవేశిస్తున్నట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ 2009 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యంపార్టీ తరపున పోటీచేశారు. తర్వాత కాలంలో ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షులు చిరంజీవితో అభిప్రాయబేధాలు రావడంతో రాధాకృష్ణ పార్టీకి దూరంగా వున్నారు. చిరంజీవి కూడా ఆయన పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యంపార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. దాదాపు రెండేళ్ళుగా ఏ రాజకీయపార్టీతో సంబంధాలు లేకుండా వున్న రాధాకృష్ణ ఇటీవల కాలంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది.
అయితే ఆ తర్వాత అంటే రెండు వారాల క్రితం రాధాకృష్ణ ఆకస్మికంగా చిరంజీవిని కలిశారు. ఆయనతో కలిసి వచ్చిన తర్వాత కేవలం వారంరోజుల వ్యవధిలోనే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పక్షంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు ఇస్తారా? అని ప్రశ్నించినప్పుడు రాధాకృష్ణకు ఎటువంటి హామీ లభించలేదని అందుకే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
2014 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చేటట్లు జగన్ తో ఒప్పందం జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఆ ఒప్పందం మేరకే ఏప్రిల్ 27వ తేదీన విజయవాడలో జరిగే ఒక కార్యక్రమంలో జగన్ సమక్షంలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విజయవాడ సెంట్రల్ సీటుపై ఆశతో క్రియాశీలకంగా పనిచేస్తున్న గౌతమ్ రెడ్డి నిరుత్సాహానికి గురికాకుండా జగన్ ఆయనకు నచ్చచేప్పినట్టు తెలిసింది. స్థానిక సంస్థలలో విజయవాడ ఓపెన్ కేటగిరీలో వున్నట్లయితే మేయర్ స్థానం ఇస్తామని, ఒకవేళ మేయర్ రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఉడా (VUDA) చైర్మన్ పదవి వచ్చే విధంగా గౌతమ్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.