పడాల నాయకత్వంపై పెరుగుతున్న అసంతృప్తి.
posted on Apr 4, 2012 8:39AM
విజయనగరం జిల్లాలో తెలుగుదేశంపార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఒకప్పుడు టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అసలు పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పార్టీ అధికారంలో ఉన్న 8ఏళ్ళ అనేక పదవులు అనుభవించిన నాయకులు పార్టీ అభివృద్ధికి ఏమీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చీపురపల్లి, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం నియోజకవర్గాల్లో క్యాడర్ అంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. ఈ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి పడాల అరుణ పనితీరుపై కూడా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అసమర్థత వల్లే గజపతినగరం నియోజకవర్గంలో టిడిపి అడ్రస్ లేకుండా పోతుందని మిగిలిన కొద్దిపాటి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో కీలకమైన ఈ నియోజకవర్గంలోని పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలస పోతున్నప్పటికీ ఆమె పట్టించుకోవడం లదని వారు వాపోతున్నారు. మాజీ మంత్రి అరుణను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే దార్తిరాజేలు మండల మాజీ జడ్ పి టి సి సభ్యురాలు నిట్టిరేద్ది లక్ష్మి, ఆ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు గౌరినాయుడు మరికొంతమంది సర్పంచ్ లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ మంత్రి అరుణ కనీసం వారిని వారించలేకపోయారని తెలుస్తోంది. పడాల అరుణ ప్రస్తుతం గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి ఇన్ ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలోనే పార్టీ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వుంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని కార్యకర్తలు అంటున్నారు.