డికె నిర్ణయం వెనుక డిస్టిలరీ వివాదం
posted on Apr 4, 2012 8:42AM
మాజీ ఎంపి డికె ఆదికేశవులు నాయుడు తెలుగుదేశం పార్తీలో చేరాలని నిర్ణయించుకుని తరువాత మనసు మార్చుకోవడం వెనుక ఒక డిస్టిలరీ వ్యవహారం ఉన్నట్లు తెలియవచ్చింది. తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ ను చదలవాడ కృష్ణమూర్తికి ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అయితే ఈ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు ఇస్తేనే తాను తెలుగుదేశంపార్టీలో చేరతానని ఆదికేశవులునాయుడు మెలికపెట్టారు. ఈ మేలికకు కారణం చదలవాడ కృష్ణమూర్తికి ఆదికేశవులునాయుడుకు మధ్య ఉన్న వివాదమే. రేణిగుంట సమీపంలోనే వి.ఆర్. డిస్టిలరీ వ్యవహారంలో వీరిద్దరికీ వివాదం ఉంది.
సుమారు రూ. 12 కోట్ల వాటా విషయమై వీరిద్దరి మధ్య ఈ వివాదం ఏర్పడింది. ఇది గత ఏడాదిగా పరిష్కారం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆదికేశవులునాయుడిని తెలుగుదేశం పార్టీలో చేరవలసిందిగా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. అయితే ఇదే సమయంలో ఆదికేశవులునాయుడుకి వ్యతిరేకంగా ఉన్న చదలవాడ కృష్ణమూర్తికి తిరుపతి టిక్కెట్ కేటాయించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆదికేశవులు నాయుడు తాను తెలుగుదేశం పార్టీలో చేరాలంటే చదలవాడకు బదులుగా తన సహచరుడు, మాజీ ఎమ్మెల్యే అయిన వెంకటరమణకు టిక్కెట్ ఇవ్వాలని షరతు పెట్టారు. దీనికి చంద్రబాబునాయుడు అంగీకరించకపోవడంతో డికె మనసు మార్చుకుని తాను మళ్ళీ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించారు.