నెల్లూరు లోక్ సభ దేశం అభ్యర్థిగా 'వైశ్రాయ్' బంధువు?
posted on Apr 20, 2012 10:58AM
నెల్లూరుజిల్లా లోక్ సభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రంగంలోకి దిగబోయే అభ్యర్థిపై ఇంకా అస్పష్టత నెలకొని ఉండి. నిజానికి ఈ స్థానం నుంచి వంటేరు వేణుగోపాలరెడ్డి పోటీ చేయటం ఖాయమని ఒకదశలో ప్రచారం జరిగింది. కానీ, పోటీకి ఆయన పెద్దగా ఆసక్తి చూపటం లేదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తరపున టి.సుబ్బిరామిరెడ్డి పోటీ చేసే అవకాశం ఉండి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తాజా మాజీ మేకపాటితో పాటు సుబ్బిరామిరెడ్డి వంటి బలమైన ప్రత్యర్థులను ఢీకొనే సత్తా వంటేరు వేణుగోపాలరెడ్డికి లేదని తెలుగుదేశంపార్టీ అధిష్టానానికి కూడా తెలుసు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా వైశ్రాయ్ హోటల్స్ అధినేత ప్రభాకరరెడ్డికి స్వయాన బావ అయిన అల్లంపాటి విజయవర్ధనరెడ్డి పేరు వినిపించింది. పారిశ్రామికవేత్త అయిన అల్లంపాటి విజయవర్ధనరెడ్డికి టిక్కెట్టు ఇస్తే మిగిలిన ఇద్దరు అభ్యర్థులతో సమానంగా ఎన్నికల్లో ఖర్చు చేయగలరని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అల్లంపాటి అభ్యర్థిత్వంపై టిడిపిలో పెద్దగా వ్యతిరేకత కూడా ఉండదని చంద్రబాబునాయుడు అంచనా వేస్తున్నారు.