11వ వార్షికోత్సవం పేరిట టి.ఆర్.ఎస్. వసూళ్లు
posted on Apr 20, 2012 11:02AM
తెలంగాణా రాష్ట్ర సమితికి పెద్దఎత్తున నిధుల వసూళ్ళకు మరో ఛాన్స్ వచ్చింది. రంగారెడ్డిజిల్లా వికారాబాద్ పట్టణంలో టి.ఆర్.ఎస్. 11వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి ఎలా లేదన్న రెండు కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేస్తున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం కనీసం 20 కోట్లు వసూళ్లు చేయాలనే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు, వ్యాపారసంస్థల యజమానులకు ఫోన్లు చేస్తున్నారు.
పెద్ద పరిశ్రమలకు ఐదు లక్షలు, మధ్యతరహా పరిశ్రమలకు రెండు లక్షలు, చిన్నతరహా పరిశ్ర మలకు 50వేల రూపాయల చొప్పున రేటు నిర్ణయించి వసూళ్లు ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీన జరిగే ఈ 11వ వార్షికోత్సవ సంబరాలకు తెలంగాణా నుంచి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని నిర్వాహకులు అంటున్నారు. అయితే పరిశ్రమల యజమానులు ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు విద్యుత్తుకోట కారణంగా నష్టాలపాలవుతున్నాయి. అయినా టి.ఆర్.ఎస్. నేతలు మాత్రం నిర్దయగా వసూళ్లు చేస్తున్నారు. ఎవరైనా ఇవ్వనని మొండికేస్తే వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో అటు పారిశ్రామికవేత్తలు, వ్యాపారసంస్థల యజమానులు ఇబ్బందులకు గురవుతున్నారు.