రాయచోటి, రాజన్నపేటల్లో బలిజలపైనే దేశం ఆశలు

కడపజిల్లా రాజన్నపేట, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా పావులను కదుపుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో బలిజ ఓటర్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. అందుకే ఇక్కడ బలిజసామాజిక వర్గానికి చెందిన వ్యక్తులనే తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపింది. రాజన్నపేటలో మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య పేరును రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు కుమారుడు బాలసుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేసింది. దీనివల్ల ఈ రెండు నియోజకవర్గాల్లో బలిజ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే వస్తాయని పార్టీ నమ్మకం పెట్టుకుంది.

 

ఈ రెండు స్థానాల్లో బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మయ్యకు తెలుగుదేశంపార్టీ టిక్కెట్టు ఇవ్వటం ద్వారా ఉప ఎన్నికల పోరులో త్రిముఖపోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల మెహబూబ్ నగర స్థానంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల సమయంలో రౌండు రౌండుకు గెలుపు అవకాశం వేరువేరు పార్టీలకు ఎలా మారిందో ప్రస్తుతం రాయచోటి, రాజన్నపేటల్లో కూడా అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాజన్నపేట టిడిపి అభ్యర్థి బ్రహ్మయ్య గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పి.ఆర్.పి. కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత ఆయన పార్టీ కార్యకలాపాలకు అంటీఅంటనట్లు ఉంటున్నారు. బ్రహ్మయ్యకు ఉన్న కేడర్, ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబునాయుడు ఆయన్ని పార్టీలోకి పిలిచి టిక్కెట్టు ఇవ్వటం విశేషం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu