ఇరకాటంలో రాయదుర్గం దేశం అభ్యర్థి దీపక్ రెడ్డి

అనంతపురం రాయదుర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న గుణపాటి దీపక్ రెడ్డి ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రేట్ ఇండియా మైనింగ్ కంపెనీ పేరుతొ దీపక్ రెడ్డి పలుచోట్ల క్రషర్ యూనిట్లు నడుపుతున్నారు. ఆయనకు రాజకీయ అనుభవం లేనప్పటికీ, స్థానికులు కాకపోయినప్పటికీ చంద్రబాబునాయుడు దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. ఇది స్థానికంగా టిక్కెట్ పై ఆశలు పెంచుకున్న పలువురు నాయకులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న తమను కాదని ఎక్కడినుంచో వచ్చిన దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం ఏమిటని అంటున్నారు.

ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన బిసి నాయకులు కూడా దీపక్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బిసి నేతలైన కెబి సిద్దప్ప, పూల నాగరాజు, రామాంజనేయులు, కురుబ శివశరవణ, పూజారి శ్రీనివాసులు, శెట్టప్ప, ఆంజనేయులు, బుడుగు నాగేశ్వరరావు తదితర బిసి నాయకులు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇంటిపోరుతో సతమతమవుతున్న దీపక్ రెడ్డికి మరో సమస్య కూడా ఎదురైంది. దీపక్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీ రాయల్టీ సేల్స్ టాక్స్ చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేయడమే కాకుండా కంకరను అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీపక్ రెడ్డి కంపెనీ నిబంధనలకు విరుధ్ధంగా వ్యవహరించడంతో గనులు, భూగర్భశాఖ విజిలెన్స్ అధికారులు ఆ కంపెనీపై కోట్లాది రూపాయల పెనాల్టీ కూడా విధించారు. అయితే ఈ పెనాల్టీ కట్టకుండా దీపక్ రెడ్డి స్టే తెచ్చుకున్నారు. కేవలం తన వ్యాపార వృద్ధికోసమే దీపక్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. దీంతో దీపక్ రెడ్డి ఎన్నికలకు ముందే పలు సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu