యుపిలో రాహుల్ ఎన్నికల యాత్ర!
posted on Nov 21, 2011 12:09PM
న్యూ
ఢిల్లీ: వచ్చే యేడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన ఎన్నికల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ నెల 22వ తేదీన బారాబంకీ జిల్లాలో యాత్ర ప్రారంభించి ఆరు రోజుల పాటు వివిధ జిల్లాల్లో రాహుల్ పర్యటిస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత రీటా బహుగుణ జోషీ తెలిపారు. యూపీలో మాఫియా పాలన కొనసాగుతోందని, దానికి అడ్డుకట్ట వేయాలంటూ ఈ నెల 14వ తేదీన రాహుల్ తన ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెల్సిందే.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీతో పాటు బలరాంపూర్, శ్రావస్తి, బహ్రాయిచ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలపై చర్చిస్తారని చెప్పారు. రాహుల్ వివిధ జిల్లాల్లో బ్లాక్ స్థాయి కార్యకర్తలతో సమావేశమై 2012 అసెంబ్లీ ఎన్నికలకు వారిని సమాయత్తం చేస్తారని జోషీ వివరించారు.