ఘనంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
posted on Feb 1, 2021 11:33AM
అమెరికాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన వేడుకల్లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గ మండలి, అధ్యాపకులు, విద్యార్థులు, దాతలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం, భరత నాట్యం, సంస్కృతం కోర్సులలో భారతదేశం, ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాలనుండి మొత్తం 38 మంది విద్యార్థులు డిగ్రీ, డిప్లమో పట్టాలను పొందారు. కుటుంబ సభ్యులతో వర్చువల్ సదస్సులో పాల్గొని వారంతా ఆనందోత్సవాల్ని పంచుకొన్నారు.
2021 సంవత్సరంలో పట్టభద్రులవుతున్న విద్యార్థులను ఈ సందర్భంగా పాలకమండలి అభినందించింది.. Class of 2021 విద్యార్థులు సాధించిన విజయాలను కీర్తిస్తూ.. విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందించిన తోడ్పాటును ప్రశంసిస్తూ.. భవిష్యత్తులో వారు మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని అభిలషించింది. స్నాతకోత్సవంలో ప్రసంగించిన విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ .. విద్యార్థులు తాము సాధించిన విజయాలను చూసి గర్వపడాలని చెప్పారు. భారతదేశ సంస్కృతి ఎంతో పురాతనమైనదని.. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం తొలినాళ్లలోనే ప్రపంచ ప్రఖ్యాతినొందిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు నెలకొన్నాయని తెలిపారు. ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను ఎదుర్కొని 1916 సంవత్సరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని పండిత్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించారని చెప్పారు కూచిభొట్ల. ఇలాంటి మహనీయులనుండి స్ఫూర్తి పొందుతూ, సమిష్టి కృషితో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుకొందామన్నారు. భవిష్యత్తు మనదే అన్న బలమైన నమ్మకంతో ముందుకు సాగుదామని పిలుపిచ్చారు కూచిభొట్ల ఆనంద్.
అత్యంత విలువైన ప్రాచీన భారతీయ కళలు, సాహిత్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ప్రతి ఒక్కరికి పారదర్శంగా అందించడంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం విజయం సాధించిందని ట్రస్టీస్ బోర్డ్ చైర్మన్ డా. పప్పు వేణుగోపాల్ అన్నారు. స్నాతకోత్సవ ఉపన్యాసకుడు, యునైటెడ్ నేషన్స్ భారత రాయబారి, T.S తిరుమూర్తి విశ్వవిద్యాలయ పత్రిక 'శాస్త్ర' ను ఆవిష్కరించారు. పట్టభద్రులను అభినందిస్తూ ఆయన సందేశమిచ్చారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పట్టభద్రులుగా బయట ప్రపంచంలో అడుగిడుతున్న విద్యార్థులు.. భారతదేశపు చింతన, సంస్కృతి, సంప్రదాయ రాయబారులుగా ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. జ్ఞాన సముపార్జన, ఆత్మబోధనయే కేంద్రమైన భారతీయ సంస్కృతి మిగిలిన సంస్కృతులకంటే విభిన్నమైనదని తెలిపారు. భారతదేశపు విలువలకు అంతర్జాతీయ వేదికపై తగిన గుర్తింపు తేవడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి జరుగుతున్నదని T.S తిరుమూర్తి కొనియాడారు.
గడిచిన నాలుగేళ్లలో ఎన్నో మార్పులు జరిగినా.. తమ తపన మాత్రం చెక్కుచెదరలేదన్నారు విశ్వవిద్యాలయ ప్రొవోస్ట్ చమర్తి రాజు. 2020 సంత్సరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం (Candidacy)లభించిందన్నారు. త్వరలో గుర్తింపు హోదా (Accreditation) కూడా లభిస్తుందని ఆయన ఆశావహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వేతనం (Scholarships) ఇచ్చే దిశగా విశ్వవిద్యాలయం ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొండుభట్ల దీనబాబు. మీరందరు మీ మాతృవిద్యా సంస్థతో సంబంధాలు కొనసాగించాలని విద్యార్థులకు ఆయన సందేశమిచ్చారు. విశ్వవిద్యాలయ సామాజిక సంబంధాల సలహాదారుడు కొండిపర్తి దిలీప్ విద్యార్థులను అభినందిస్తూ వారు భవిష్యత్తులో ఎన్నో విజయాలను సాధించాలని ఆశించారు.
మారేపల్లి వెంకటశాస్త్రి గారి వేదప్రవచనంతో ప్రారంభమైన సదస్సులో చమర్తి జాహ్నవి అమెరికా జాతీయ గీతం ఆలపించింది. విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్థుల సహకారంతో Dr. T.K సరోజ స్వరపరిచిన స్నాతకోత్సవ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.