అమెరికాలో తెలుగు హోర్డింగ్స్‌..!

అమెరికాలో తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న సంస్థ సిలికానాంధ్ర. ఇప్పటి వరకు 6000 మందికి పైగా విద్యార్థులకు తెలుగు నేర్పిస్తున్న ఘనత సిలికానాంధ్ర సొంతం. తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన మనబడి వార్షిక పరీక్షలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అలాగే 2016-17 విద్యా సంవత్సరం మనబడి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మనబడి ప్రచార కార్యక్రమాలు మొదలెట్టింది. దీనిలో భాగంగా న్యూజెర్సీ-న్యూయార్క్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన 60 అడుగుల హోర్డింగ్ ఆకట్టుకుంటోంది. తెలుగుతనం ఉట్టిపడే బాపు బుడుగు, సీగాన పెసూనాంబల బొమ్మలు ముచ్చటగొలుపుతున్నాయని పలువురు తెలుగువారు అంటున్నారు. ప్రతీ రోజూ వేలాది వాహనాలు తిరిగే ఈ రహదారి న్యూయార్క్ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండటం, అత్యంత భారీ సంఖ్యలో భారతీయులు ప్రయాణం చేసే మార్గం అవడం వల్ల-ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశామని మనబడి ఉపాధ్యక్షులు శరత్ వేట తెలిపారు.