ఏపీలో బుసకొడుతున్న అరాచకం.. దగ్గరుండి మరీ రెండు దేవలయాల కూల్చివేత

ఏపీలో జగన్ సర్కారు అరాచకానికి అంతు లేకుండా పోతోంది. అమ్మవారి భక్తుల సెంటిమెంట్లు పట్టడం లేదు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని అందరూ చూస్తుండగానే దారుణంగా అవమానించారు. అసలు హిందువుల సెంటిమెంట్లంటేనే జగన్ ఖాతరు చేయడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి వందకు పైగా ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం అయ్యాయి.

హిందువుల మీద విపరీతమైన ద్వేషం ప్రదర్శించేవారిని  వెనకేసుకొస్తున్న జగన్ వైఖరి కారణంగానే.. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మరో రెండు ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఆంజనేయస్వామి గుడిని కొట్టేసి విగ్రహాన్ని దగ్గరలోనే ఉన్న బావిలో పడేయడం హిందూ భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. నిత్య పూజలు అందుకునే ఆంజనేయస్వామి విగ్రహం తమ కళ్ల ముందే బావిలో పడేస్తుంటే ఏం చేయాలో, ఎవరిని నిలదీయాలో తెలియక అమాయకులైన పాతపట్నం గ్రామప్రజలు  నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఆ దృశ్యాలు కాస్తా కొందరు విలేకరుల దృష్టికి రావడంతో ఈ అరాచకం బయటపడింది. 

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే స్థానిక పెట్రోల్ బంకు దగ్గర నుంచి ఫ్లైఓవర్ వెళ్తోంది. ఆ పెట్రోల్ బంకు వద్దనే ఆంజనేయస్వామి గుడి ఉంది. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం వచ్చిన సిబ్బంది ఆలయాన్ని పూర్తిగా కొట్టేయాలంటూ ముందుకొచ్చారు. స్థానికులు, గుడి పూజారి అధికారుల ముందుకొచ్చి ఒక గంట సమయం ఇవ్వాలని ఎంతో ప్రాధేయపడ్డా వినకుండా అప్పటికప్పుడే ఆంజనేయస్వామి గుడిని పూర్తిగా నేలమట్టం చేశారు. గుడిని నేలమట్టం చేయడం ఒక ఎత్తయితే... ప్రతిరోజూ పూజలందుకునే ఆంజనేయస్వామి విగ్రహం మీద కక్ష కట్టినట్టు.. దాన్ని బావిలో పడేయడాన్ని మాత్రం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆంజనేయస్వామి భక్తుల మనోభావాలు, హిందువుల సెంటిమెంట్లు దారుణంగా గాయపడ్డాయి.

గుడిని గానీ, ఏదైనా ప్రార్థనా స్థలాన్ని గానీ తొలగించాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆస్తికి ఇచ్చేపాటి విలువ కూడా హిందువుల ఆరాధ్య దైవానికి ఇవ్వకపోవడంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, కనీసం విగ్రహాన్ని తరలించే సమయం కూడా ఇవ్వకుండా కక్ష కట్టినట్టు వ్యవహరించడమేంటని ప్రజలంతా నిలదీస్తున్నారు. ఈ గుడినే నమ్ముకున్న పూజారి కుటుంబం రోడ్డున పడి విలపిస్తోంది. గుడినే జీవనాధారంగా బతుకుతున్న తమకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

పాతపట్నం ప్రజల హాహాకారాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్లైఓవర్ నిర్మాణకర్తల విధ్వంసకాండ కొనసాగింది. అక్కడే ఉన్న నీలమణి దుర్గమ్మ గుడి మీద కూడా ప్రతాపం చూపారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎంతో దైవంగా కొలిచే అమ్మవారి గుడిని సగభాగం కొట్టేశారు. దీంతో ఆ ప్రాంతమంతా భయానకమైన వాతావరణం కమ్ముకొంది. స్థానిక ప్రజలంతా ఈ అరాచకాన్ని ఆపేదెవరు.. తమ గోడు వినేవారెవరు... అంటూ రోదిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకైనా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా, తమకు సమయం ఇవ్వకుండా ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని రెండు గుళ్లను కొట్టేయడమేంటని ప్రజలు నిలదీస్తున్నారు. మరి జగన్ ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో చూడాలంటున్నారు స్థానికులు.