రెండున్నర ఏండ్ల తర్వాతబిగ్ ఫైట్.. భారత్- పాక్ మ్యాచ్ తో క్రికెట్ ఫీవర్...

ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సమరం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో  దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం ఈ ఉత్కంఠ సమరానికి వేదిక కానుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా దాయాది జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో భారకత్- పాక్ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు అత్యంత అరుదుగా మారాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే అభిమానులకు ఆ అవకాశం దక్కుతోంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడపోతున్నాయి. చివరిసారిగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. బ్రాడ్‌కాస్టర్ల ఖజానా నింపే ఈ మ్యాచ్‌ కోసం 17,500 టిక్కెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. 

ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యంగా ఉంది. వన్డే వరల్డ్‌క్‌పలో ఏడు సార్లు.. టీ20 ప్రపంచక్‌పలో ఐదుసార్లు గెలిచింది. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లాడితే భారత్‌ ఏడింటిలో గెలిచింది.టీ20 ప్రపంచక్‌పలో తొలిసారిగా కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు పాక్‌ను ఎదుర్కొనబోతోంది.  కెప్టెన్ కోహ్లీకి ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఇదే ఆఖరి టోర్నీ కూడా. అందుకే అన్ని విధాలా ఈ మ్యాచ్‌ చిరస్మరణీయం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంతకుముందు ఐదుసార్లు ఈ మెగా టోర్నీల్లో ధోనీ ఆధ్వర్యంలోనే జట్టు బరిలోకి దిగింది. ఇప్పుడు ధోనీ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఫార్మాట్‌లో బలంగా కనిపిస్తున్న పాక్‌ జట్టును.. గత రికార్డును దృష్టిలో ఉంచుకుని తేలిగ్గా తీసుకుంటే షాక్‌ తప్పదు. 

భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నారు. పేసర్‌ షహీన్‌ షా అఫ్రీదిని వీరు దీటుగా ఎదుర్కొని పరుగులు రాబడితే మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కోహ్లీ నెంబర్‌ త్రీలో రావడం ఖాయం కాగా, ఆ తర్వాత మిడిల్‌ ఓవర్లలో సూర్యకుమార్‌ దూకుడు జట్టుకు లాభించనుంది. ఆరో నెంబర్‌లో హార్దిక్‌ వైపే కోహ్లీ మొగ్గు చూపుతున్నాడు. స్పిన్‌ విభాగంలో జడేజాకు జతగా అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌లలో ఒకరిని ఆడించవచ్చు. పేస్‌ త్రయం బుమ్రా, షమి, శార్దూల్‌ పాక్‌ బ్యాటర్స్‌ పనిబట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై విజయాలు లేకున్నా పాక్‌ ఆ గతాన్ని గుర్తుచేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ జట్టు టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆడిన 25 టీ20ల్లో 15 మ్యాచ్‌లు గెలిచారు. పాక్‌ టాపార్డర్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (1462), కెప్టెన్‌ ఆజమ్‌ (1363) ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన  టాప్‌-2 క్రికెటర్లు. ఆజమ్‌ ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. ఇదే జోరును భారత్‌పైనా చూపాలనుకుంటున్నారు. ఇక నెంబర్‌ 3లో ఫఖర్‌ జమాన్‌ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. రెండు వామ్‌ప మ్యాచుల్లో కలిపి అతను 98 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో లెఫ్టామ్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రీది ఇబ్బందిపెట్టవచ్చు. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో మహ్మద్‌ ఆమిర్‌ను భారత టాపార్డర్‌ ఆడలేక మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక స్పిన్నర్లు ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌ కూడా జట్టుకు ఉపయోగపడాలనుకుంటున్నారు.