కారు బీభత్సం... ఇద్దరు మృతి
posted on Dec 17, 2025 10:16AM

హైదరాబాద్ శివారులో బుధవారం (డిసెంబర్ 17) తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్ శివారు మైలార్ దేవుని పల్లి ప్రాంతంలో ఈ ఉదయం ఐదు గంటల సమయంలో అతి వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించే దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆ దుకాణంలో నిద్రిస్తున్న తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు.
మరొ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో తండ్రి ప్రభుమహరాజ్, అతని ఇద్దరు కుమారులు దీపక్, సత్తునాథ్ లు నిద్రిస్తున్నారు. ఈ ఘటనలో దీపక్ సంఘటనా స్థలంలోనే మరణించగా, తండ్రి ప్రభు మహరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ప్రభు మహరాజ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చి మైలార్ దేవుపల్లిలో దుప్పట్లు, రగ్గుల వ్యాపారం నిర్వహిస్తున్నారు.
కాగా ప్రమాదానికి కారణమైన కారులో ఆరుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెడుతుండగా అదుపుతప్పిందనీ, సంఘటన జరిగిన తరువాత కారులో ఉన్నవారిలో ముగ్గురు పారిపోగా, మిగిలిన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.