బోండీ బీచ్ మృతులు అసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్ల సంతాపం
posted on Dec 17, 2025 4:10PM

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్‌లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు బుధవారం (డిసెంబర్ 17) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆటలో పాల్గొన్నారు. అలాగే స్టేడియంలోని ఇరు దేశాల జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేశారు. సిడ్నీలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో.. మూడో టెస్టు జరిగే ఆడిలైడ్ మైదానం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.
బోండీ బీచ్ దుర్ఘటనపై ఇరు జట్ల ప్లేయర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి సమీపంలో నివసించే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్.. జరిగిన దుర్ఘటన తనను భయాందోళనకు గురి చేసిందన్నాడు. బోండీ బీచ్ తన ఇంటికి చాలా దగ్గర్లోనే ఉంటుందని, తరచూ తన పిల్లలను అక్కడికి తీసుకువెళుతుంటానని కమిన్స్ తెలిపాడు. క్రికెట్ ప్రపంచంలోని ప్రతిఒక్కరూ బోండీ బీచ్ బాధితులకు, వారి కుటుంబాలకు, స్నేహితులకు, యూదులకు మద్దతుగా ఉన్నారని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ అన్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఇది ఆస్ట్రేలియా, సిడ్నీ నగరంతో పాటు యూవత్తు ప్రపంచానికి కూడా చాలా విచారకరం అని అన్నాడు.